Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘నాటేది ఒక్క మొక్క.. వేసేను నూరు కొమ్మ.. కొమ్మ కొమ్మ విరగబూసే వేలాదిగా..’’ రేపటి తరానికి పచ్చదనం పంచాలనుకున్న ఓ పెద్దాయన పాడుకున్న పాట ఇది. ఎలా పుట్టిందో.. ఎప్పుడు చిగురించిందో స్పష్టత లేదు. ఈ మర్రిమాను మాత్రం వందలాది కొమ్మలతో విస్తరించింది. వేల ఊడలతో… ఎనిమిదిన్నర ఎకరాల్లో నీడనిస్తోంది. ఆ మహామాను ఎక్కడుందంటే…
ఎక్కడికి వెళ్లినా.. పచ్చని చెట్టు కనిపిస్తే… దాని నీడలో కాసేపు సేదతీరి ప్రయాణ బడలికను తీర్చుకుంటాం. ఓ చెట్టును చూసేందుకు ప్రయాణం కడితే.. అది తిమ్మమ్మ మర్రిమాను యాత్ర అవుతుంది. అనంతపురం జిల్లా ఎన్పీకుంట మండలం గూటిబైలులో ఉందీ భారీ వృక్షం. వయసు 660 ఏళ్లకు పైమాటే. 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.మర్రి చుట్టూ ప్రదక్షిణ
1990 నుంచి తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ బాధ్యతలను అటవీశాఖ చేపట్టింది. ప్రజల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చెట్టు ఊడలు పాడవకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు. అంతేకాదు మర్రిమాను విస్తరించిన 8.5 ఎకరాల చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. యాత్రికులు నడిచేందుకు కాలిబాట నిర్మించారు. మర్రిమాను పరిసరాల్లో పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం కూడా ఉంది. వన్యప్రాణుల షెడ్డు నిర్మించి పావురాలు, నెమళ్లు, కుందేళ్లను సాకుతున్నారు. యాత్రికుల బస కోసం పర్యాటక శాఖ అతిథి గృహాన్ని కూడా నిర్మించింది.

కదిరి సమీపంలో.. తిమ్మమ్మ వటవృక్షం కదిరికి 27కి.మీల దూరంలో ఉంది. కదిరి నుంచి బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి రాయచోటి, ఎన్పీకుంట మీదుగా కూడా అక్కడికి చేరుకోవచ్చు. చిత్తూరు జిల్లా వాసులు కొక్కంటిక్రాస్‌ మీదుగా వస్తుంటారు. కదిరి నారసింహుడిని దర్శించుకున్న భక్తులు చాలామంది పనిలో పనిగా మర్రిమాను సందర్శనకు తరలి వస్తారు.

తిమ్మమ్మ శక్తితోనే..
తిమ్మమ్మ మర్రిమానుకు ఆ పేరు రావడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. తిమ్మమాంబ బుక్కపట్నానికి చెందిన వెంకటాచార్యులు, మంగమాంబల కుమార్తె. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో 1335 ప్రాంతంలో ఆమె వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు బిడ్డలు పుట్టి చనిపోయారు. కొంతకాలానికి బాలవీరయ్య కుష్ఠువ్యాధితో మరణించాడు. దీంతో తిమ్మమాంబ సతీసహగమనం చేసింది. భర్త కోసం పేర్చిన చితిలో దూకడానికి ఆమె ఏర్పాటు చేసుకున్న పందిరి గుంజ (కర్ర) కొంతకాలానికి చిగురించిదట. అదే మహావృక్షంగా ఎదిగిందని చెబుతారు. నీరు పుట్టని కరవు సీమలో ఈ మర్రిమాను ఇంతలా విస్తరించడానికి తిమ్మమ్మ పతిభక్తి, శక్తే కారణమని స్థానికుల విశ్వాసం. తిమ్మమ్మను వనదేవతగా ఆరాధిస్తున్నారు. సంతానం లేని దంపతులు తిమ్మమ్మ మర్రిమానుకు ముడుపు కడితే పిల్లలు కలుగుతారని విశ్వసిస్తారు. తిమ్మమాంబ జననం, వివాహం, సతీసహగమనం సోమవారమే జరిగాయంటారు. అందుకే ఏటా మే నెల చివరి సోమవారం తిమ్మమాంబకు మర్రిమాను పరిసర గ్రామాల ప్రజలు బోనాలు సమర్పిస్తారు.