Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే” అంటూ ప్రార్థించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తాం. తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజ చేస్తాం. పిన్నల నుండి పెద్దల వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతా గణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది. అలాగే ‘గణ’ శబ్దంలో ‘గ’ అంటే విజ్ఞానమని ‘ణ’ అంటే మోక్షమని బ్రహ్మవైవర్తన పురాణము చెపుతోంది.
ఇంకా మహాగణపతిని 1. మహాగణపతి 2. హరిద్రాగణపతి 3. స్వర్ణ గణపతి 4. ఉచ్చిష్ట గణపతి 5. సంతాన గణపతి 6 నవనీత గణపతి అని ఆరు రూపాలుగా పూజిస్తారు. మహాగణపతి సిద్ధి, బుద్ధి అను ఇద్దరిని పెళ్లాడగా, వారికి క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కుమారులు కలిగినారు. అందువల్ల మహాగణపతిని పూజించడం వల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరము కోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని  విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమందు నివశించాలని వరము పొందినాడు.
అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను గంగిరెద్దువానిగా వేషము ధరించి గంగిరెద్దును ఆడించి గజాసురుని మెప్పించి ఉదర కుహరమందున్న పరమశివుని కోరినాడు. అంత విష్ణు మాయను గ్రహించిన గణముఖుడు.. నా అనంతరం నా శిరస్సు త్రిలోలకములు పూజించినట్లుగా, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము ఇవ్వమని కోరుకుంటాడు. ఈ క్రమంలో తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి, శివునకు ఉదర కుహరము నుండి విముక్తి కలిగించాడు.
ఆ శుభవర్తమానము తెలిసిన పార్వతీదేవి అభ్యంగన స్నానమాచరించి భర్తను స్వాగతించాలని తలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణ ప్రతిష్ట చేసి స్నానవాకిట ముందు కాపలా ఉంచినది. అంత పరమశివుడు సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరుని గాంచిన ఆ బాలుడు అభ్యంతర మందిరము వద్ద నిలువరించగా, ఆ బాలునికి పరమేశ్వరుడు శిరచ్ఛేదము చేసినాడు. అది చూసిన మహేశ్వరి దుఃఖమును తీర్చుటకై తన వద్ద నున్న గజశిరమును ఆ బాలునకు అతికించి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు.
ఆ గజాననునికి, తన రెండవ కొడుకైన కుమార స్వామికి మధ్య భూ ప్రదక్షిణ పోటీ పెట్టిన పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడిని త్రిలోక పూజితుడిగా గణాధిపత్యము ఆ బాలునికి కలిగించినారు.