Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ సింగిల్‌ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్‌ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడీ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. దీంతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. 2011లో డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు తరపున ఆడిన సంగక్కర 19 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019లో బంగ్లా వికెట్‌ కీపర్‌ నురుల్ హసన్‌ కూడా 19 డిసిమిసల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆర్సీబీతో ఆదివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ రెండు అద్భుత క్యాచ్‌లు పట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ కీపింగ్‌లో మాత్రం మెరిశాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టి క్లాసెన్‌, గురుకీరత్‌ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్‌ ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతేడాది ఐపీఎల్‌లో కూడా పంత్‌ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌(684)గా నిలిచాడు.