Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెల్లపులి అంటేనే చాలామందికి ప్రస్తుతం అసహ్యమేస్తోంది. ఢిల్లీ జూలో ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరి మదిలో ఆవేదననే నింపింది. అయితే సామాజిక వెబ్‌సైట్ల పుణ్యమా అంటూ ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తెలిసినా… ఆ పిల్లాడి నిండు ప్రాణాలు మాత్రం తిరిగొచ్చేది లేదు. ఏదో రాయి విసిరేస్తూ.. పులి బోనులో చిక్కుకుపోయిన ఢిల్లీ విద్యార్థి 15 నిమిషాల పాటు ఆ తెల్లపులితో వేడుకుంటుంటే.. అక్కడ చూస్తున్నవారు తమ ఫోన్లో వీడియో, ఆడియో రూపాల్లో ఘటనను షూట్ చేసుకుంటున్నారే గానీ ఒకే ఒక్కడు ఆ పిల్లాడిని కాపాడేందుకు చర్యలు తీసుకోలేదు.
ఇదే ఏ మంత్రి కుమారుడో, సెలబ్రిటీల కుటుంబానికి చెందిన వాడైతే తప్పకుండా.. ప్రస్తుతం సొల్లు కబుర్లు చెబుతున్న జూ అధికారులే రంగంలోకి దిగి ఆ పులినైనా చంపేసే వారే. సాధారణ ఓ విద్యార్థే కదా అంటూ ఆ జూ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం ద్వారానే ఓ నిండు ప్రాణాలు విలవిల కొట్టుకుంటూ గాలిలో చేరిపోయాయి. యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో పోస్ట్ చేసేందుకు అక్కడున్న పెద్ద మనుషులు ఘటనను షూట్ చేసుకున్నారే కానీ ఏ ఒక్కడూ ఆ విద్యార్థిని కాపాడేందుకు బ్లూక్రాస్‌కో జూ అధికారులనో పిలిచి పిల్లాడిని కాపాడలేకపోయారు.
15 నిమిషాలు అంటే పావు గంట పాటు క్రూర మృగం ముందు చేతులు జోడిస్తూ వదిలేయమంటూ ప్రాధేయపడిన ఆ విద్యార్థిని ఆ పులి నోటికి కరుచుకుని తీసుకెళ్తుంటే.. జూ అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడిన చందంగా మార్ గయా అంటూ చూస్తూ ఉండిపోయారు. తప్పు ఆ పిల్లాడిదే.. అయినా ఆ సమయంలో రక్షించాల్సిన జూ అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. అంతేకాదు.. చుట్టూ నిల్చున్న వారు కూడా చూస్తుండి పోయారు. ఇదే ప్రస్తుత ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ కల్చర్..! ఎంత దారుణం… ఎంత దయనీయం. ఫోటోలూ, వీడియోల వినోదాల ముందు ప్రాణానికి విలువ లేకుండా చేసేశారు. మానవత్వం క్రూర మృగం కంటే మరింత క్రూరంగా మారిపోతోంది. ఈ కల్చర్ సమాజాన్ని ఎటు తీసుకుపోతుందో…?