Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్లర్క్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌, మేనేజర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త… ఇవన్నీ ఇప్పటి ఉద్యోగాలు. కానీ సత్వర ఆర్థికాభివృద్ధికి తోడు శాస్త్ర- సాంకేతిక రంగం బహుముఖంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని, ఊహకు అందని కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అవి ఏమిటో, ఎలా ఉంటాయనే అంశంపై అతిపెద్ద ‘ప్రొఫెషనల్‌  నెట్‌వర్క్‌’ సంస్థ అయిన లింక్డ్‌ ఇన్‌ అధ్యయనం చేసింది. దీని కోసం దేశంలో 5 కోట్ల కంటే ఎక్కువ మంది వ్యక్తిగత అర్హతల (ప్రొఫైల్స్‌)ను పరిశీలించి ‘భారతదేశంలో 10 కొత్త ఉద్యోగాలు’ అనే పేరుతో ఒక నివేదిక రూపొందించింది. దేశంలో ఏటా 50 లక్షల మంది ఉద్యోగాల విపణిలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటేనే ఉద్యోగం… లేకుంటే వెనకే ఉండిపోవలసి వస్తుంది.

టెక్నాలజీదే పెత్తనం
ఈ నివేదిక ప్రకారం కొత్త ఉద్యోగాల కల్పనలో టెక్నాలజీ రంగానిదే అగ్రస్థానం. అందువల్ల సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి కొత్త తరహా ఉద్యోగాలు, అధిక సంఖ్యలో లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు వ్యాపార సంస్థల్లో ‘మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌’ పాత్ర గత అయిదేళ్లలో 43 శాతం మేరకు విస్తరించింది.
ఆసియా- పసిఫిక్‌ దేశాల్లో కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ (సీఎస్‌ఎం) ఉద్యోగానికీ ఎంతో గిరాకీ ఉంది. ఆస్ట్రేలియాలో ఇదే నెంబర్‌:1 ఉద్యోగం. సింగపూర్‌లో 4వ స్థానంలో, మనదేశంలో 6వ స్థానంలో ఉంది. ఐటీ, ఐటీ సేవల రంగాల్లో ఈ ఉద్యోగాల సంఖ్య 27 శాతం పెరిగింది.
మున్ముందు సమాచారానికి (డేటా) గిరాకీ మరెంతో పెరగనుంది. ఈ విభాగంలో ఉద్యోగాలు అధిక సంఖ్యలో లభిస్తాయి. మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌ డేటా డెవలపర్‌ ఉద్యోగాలకు ఇప్పుడే ఎంతో ప్రాధాన్యం ఉంది. ముంబాయి, ఎన్‌సీఆర్‌ (దిల్లీ పరిసరాలు) లో డేటా సైంటిస్ట్‌ ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నాయి.
మనదేశం నుంచి సింగపూర్‌కు అధికంగా వెళ్తున్న ఉద్యోగుల్లో డేటా సైంటిస్టులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఉంటున్నారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కొన్ని దక్షిణాసియా దేశాల్లో ‘డేటా సైంటిస్ట్‌’ లకు ఎంతో డిమాండ్‌ ఉంది.
డేటా సైంటిస్టు ఉద్యోగాలకు అమెరికాలో ఎంఎస్‌ వంటి ఉన్నత విద్యార్హతతో వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. మనదేశంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కొంత అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాల్లో చేరుతున్నారు.

‘సాఫ్ట్‌ స్కిల్స్‌’ కూ గిరాకీ
కేవలం టెక్నాలజీ నైపుణ్యం ఉన్నవారే మంచి ఉద్యోగాల్లో కుదురుకుంటారని మిగిలిన వారికి కష్టమని అనుకుంటే అది తప్పు. నేర్పుగా మాట్లాడటం, ఎదుటివారిని ఒప్పించడం, బాగా రాయగల నేర్పు, బృందంలో కలిసి పనిచేయడం.. వంటి నైపుణ్యాలు (సాఫ్ట్‌ స్కిల్స్‌) ఉన్న అభ్యర్ధులకు ఇప్పుడే ప్రాధాన్యం ఉంది. ఇవి కలిగిన వారికి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ (సీఎస్‌ఎం) ఉద్యోగం ఇపు±్పడే ‘టాప్‌ 10’ జాబితాలో ఉంది. భవిష్యత్తులో దీనికి ఇంకా ప్రాధాన్యం పెరుగుతుందని అంచనా.

సమీప భవిష్యత్తులో అధిక గిరాకీ  ఉండే కొత్త ఉద్యోగాలు
1) మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌
2) అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అనలిస్ట్‌
3) బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్‌
4) ఫుల్‌ స్ట్యాక్‌ ఇంజనీర్‌
5) డేటా సైంటిస్ట్‌
6) కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌ (సీఎస్‌ఎం)
7) డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌
8) బిగ్‌ డేటా డెవలపర్‌
9) సేల్స్‌ రిక్రూటర్‌
10) పైథాన్‌ డెవలపర్‌