Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మిర్యాలగూడకు చెందిన రైతు, ఐరన్‌ సిండికేట్‌ వ్యాపారి యాదగిరి వ్యాపార రీత్యా థాయిలాండ్‌ వెళ్లారు. అక్కడ డ్రాగన్‌ఫ్రూట్‌ రుచి చూశారు. ఎన్నో పోషకాలున్న ఈ పండును తెలంగాణ గడ్డపై పండించాలనుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామశివారులోని తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ విజయవంతంగా సాగు చేసి తెలంగాణ రైతాంగానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇందుకోసం ఎంతో శ్రమించారు యాదగిరి. థాయిలాండ్‌లో ఆ పండు గురించి ఆరాతీశారు. మెళకువలు తెలుసుకున్నారు. కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూర్‌ వంటి నగరాల సమీపంలో సాగవుతున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలను పరిశీలించారు. కోల్‌కతాలో ఫంగస్‌, వైర్‌సలేని డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల అంట్లను వ్యయప్రయాసలకోర్చి తెప్పించారు. వాటిని ప్రయోగాత్మకంగా రెండేళ్ల కిందట తన బత్తాయి తోట సమీపంలో వున్న ఎకరన్నర భూమిలో సాగు చేసి, తెలంగాణ గడ్డపై డ్రాగన్‌ ఫ్రూట్‌ను పండించిన ఘనత అందుకున్నారు. ఆ స్ఫూర్తితో మరో 14 ఎకరాల్లో తానే స్వయంగా అంట్లు కట్టుకొని డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను విస్తరించారు. 15 ఏళ్ల క్రితం 40 ప్రాంతాల్లో బత్తాయి తోటలను పరిశీలించి ఏరికోరి తిరుపతి యూనివర్సిటీ నుంచి బత్తాయి మొక్కలను తెచ్చి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక బత్తాయి దిగుబడిని సాధించిన రైతుగా కూడా గుర్తింపు పొందారు యాదగిరి. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ఖర్చుతో కూడుకున్నది. ఒక ఎకరా సాగు చేయాలంటే సిమెంట్‌ స్తంభాలు, సిమెంట్‌ రింగ్‌ (బండిచక్రంలా), డ్రిప్పు, మొక్కకు కలిపి రూ. 1400 ఖర్చవుతుంది. ఎకరాకు నాలుగు వందల స్తంభాలు పాతి ప్రతి స్తంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటాలి. డ్రిప్పు ద్వారా అడపాదడపా నీటినిస్తే సరిపోతుంది. ఏడాది తరువాత చక్రానికి పాకిన డ్రాగన్‌ చెట్టు చక్రం నుంచి కిందకు వేలాడుతూ పూత పూస్తుంది. ఏడాదిన్నర తరువాత మొదటి పంట చేతికందుతుంది. ఏటా ఆగస్టు నుంచి నవంబర్‌ మాసాల మధ్యలో పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు మూడు సంవత్సరాల తరువాత నాలుగు టన్నుల చొప్పున పంట దిగుబడి వస్తుంది. ఐదు సంవత్సరాలు దాటిన తోటల్లో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ రైతు చేతికందుతాయి.
టన్ను ధర రూ. లక్ష
డ్రాగన్‌ ఫ్రూట్‌కు మన మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వాటి కోసం ఇతర దేశాల మీదే ఎక్కువ ఆధారపడున్నాం. ప్రస్తుతం డ్రాగన్‌ ఫ్రూట్‌ టన్ను రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ధర పలుకుతోంది. తెలంగాణ రైతు యాదగిరి ఎకరన్నర పొలంలో సాగు చేసిన తోటనుంచి మొదటి విడతగా రెండు టన్నుల డ్రాగన్‌ ఫ్రూట్‌ల దిగుబడి సాధించారు. వీటిని టన్నుకు 1.15 లక్షల చొప్పున చెన్నై, కోల్‌కతా పండ్ల వ్యాపారులకు విక్రయించారు. లాభదాయకంగా ఉండడంతో కోల్‌కతా నుంచి తాను తెచ్చి సాగు చేసిన డ్రాగన్‌ మొక్కలకే అంట్లు కట్టి మొక్కలు పెంచారు. ఆ మొక్కలనే తన 14 ఎకరాల పొలంలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు యాదగిరి. ఈ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేసిన తోటను గత నెలలో తెలంగాణ హార్టికల్చర్‌ శాఖ కమిషనర్‌ వెంకట్‌రామిరెడ్డి సందర్శించారు. తెలంగాణ ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ తోటలను రైతులు విరివిగా పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి రైతులను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
మొక్కల సరఫరాకు సిద్ధం
తెలుగు రాష్ట్రాల రైతులకు డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను సరఫరా చేసే ఆలోచనతో నేనే స్వయంగా మొక్కల అంట్లు కట్టించే పని చేపట్టాను. విదేశాలతో పాటు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతుల్ని గమనించాను. ఆ అనుభవంతో ఆసక్తి వున్న రైతులకు మొక్కలు సరఫరా చేసేందుకు సిద్ధంగా వున్నాను.