Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశంలోని 91 లోక్‌సభ సీట్లకు గురువారం కొనసాగుతున్న పోలింగ్‌ సరళి చూస్తుంటే 1967 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1967కు ముందు మూడు లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహతంగా అఖండ విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల నాటి ఎన్నికల్లో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది.

అయితే నాటి కాంగ్రెస్‌ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. లోక్‌సభలో చిన్నా, చితక పార్టీల బలం తొలిసారిగా పెరిగింది. నాటి ఎన్నికల్లో అంతకుముందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి 76 సీట్లు తగ్గి 283 సీట్లు వచ్చాయి. ఆ సీట్లను ప్రతిపక్ష పార్టీలు పంచుకున్నాయి. చిన్న పార్టీలకైతే ఏకంగా 26 సీట్లు పెరిగాయి.

నేటి ఎన్నికల పోలింగ్‌ సరళి చూస్తుంటే నాటి పరిస్థితులే గుర్తుకొస్తున్నాయి. పాలకపక్ష బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ ఢీకొట్టే సరైన ప్రత్యామ్నాయం ప్రజలకు కనిపించడం లేదు. బీజేపీ పట్ల బలమైన వ్యతిరేక పవనాలుగానీ, కాంగ్రెస్‌ పట్ల సానుకూల పవనాలుగానీ కనిపించడం లేదు. ఓటర్లలో నైరాశ్యం కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడం, ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం యువతలో నిర్లిప్తతకు కారణంగా కనిపిస్తోంది. 1967 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగానే నాడు కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. పాక్‌ భూభాగంలోని బాలకోట్‌లో భారత వైమానిక దాడులు, జాతీయవాదం తదితర కారణాల వల్ల యువతలో ఓ వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన ‘న్యాయ్‌’ పథకానికి పేదలు, బడుగు వర్గాల ప్రజలు ఆకర్షితులైనట్లు కనిపిస్తోంది.

ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా దేశంలో పలుచోట్ల ఐటీ దాడులు కొనసాగుతుండడం, పాలకపక్ష బీజేపీ నాయకులే పలు చోట్ల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతుండడం కూడా ఆ పార్టీలోని అసహనాన్ని సూచిస్తోంది. అందుకని బీజే పీకి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజారిటీ సీట్లు రావని, ప్రభుత్వం ఏర్పాటుకు మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పదని తెలుస్తోంది.

నరేంద్ర మోదీకి మరొక్క అవకాశం ఇవ్వడంటూ ఆ పార్టీ నాయకులు ప్రజలను కోరడమే ఈ విషయాన్ని సూచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మోదీకి మరో అవకాశాన్ని వారు కోరడంలో తప్పులేదనుకుంటా!