Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

: ఐదు టెస్టుల సిరీస్‌లో తొలిసారిగా భారత బ్యాటింగ్‌ అభిమానులకు కనువిందు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (152 బంతుల్లో 11 ఫోర్లతో 97), వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె (131 బంతుల్లో 12 ఫోర్లతో 81) వీరోచిత ఆటతీరుతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. ఫలితంగా శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో తొలి రోజు ముగిసేసరికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో ఆరు వికెట్లకు 307 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 22 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. వోక్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.

ఓపెనర్లు ఆడినా..
గత రెండు టెస్టుల్లా కాకుండా ఈసారి భారత ఓపెనర్లు ఽజట్టుకు శుభారంభాన్ని అందించారు. శిఖర్‌ ధవన్‌ (65 బంతుల్లో 7 ఫోర్లతో 35), రాహుల్‌ (53 బంతుల్లో 4 ఫోర్లతో 23) తొలి వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. అయితే ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ధాటికి టాప్‌ ఆర్డర్‌ మొత్తం 22 పరుగుల తేడాతో పెవిలియన్‌కు చేరింది. లార్డ్స్‌లో ఉద్వాసనకు గురైన ధవన్‌ ఈసారి మురళీ విజయ్‌ స్థానంలో బరిలోకి దిగి స్వేచ్ఛగా ఆడాడు. ఆండర్సన్‌, బ్రాడ్‌ల బౌలింగ్‌ను ఓపిగ్గా ఎదుర్కొంటూ అడపాదడపా బౌండరీలు సాధించాడు. తొలి గంట పాటు బంతి స్వింగ్‌ కాకపోవడంతో భారత్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. 5, 8 ఓవర్లలో ధవన్‌ రెండేసి ఫోర్లు బాదాడు.

అటు రాహుల్‌ 17వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో చెలరేగాడు. కానీ డ్రింక్స్‌ విరామం తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. వోక్స్‌ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను అవుట్‌ చేశాడు. 19వ ఓవర్‌లో బంతి ఎడ్జ్‌ తీసుకుని రెండో స్లిప్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో ధవన్‌ వెనుదిరిగాడు. ఇక 21వ ఓవర్‌లో వోక్స్‌ నుంచి దూసుకొచ్చిన ఇన్‌స్వింగర్‌కు రాహుల్‌ ఎల్బీ అయ్యాడు. పుజారా ఒత్తిడితో రివ్యూకు వెళ్లినా నిరాశ తప్పలేదు. 27వ ఓవర్‌లో మరోసారి వోక్స్‌ భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. ఛాతీ ఎత్తు వరకు వచ్చిన షార్ట్‌ బంతిని పుజారా (14) అనవసరంగా హుక్‌ షాట్‌ ఆడి లాంగ్‌ లెగ్‌లో రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో జట్టు 82/3 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.

కోహ్లీ, రహానె శతక భాగస్వామ్యం
లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్లు ఏస్థాయిలో చెలరేగుతారో అని భావించినా కెప్టెన్‌ కోహ్లీ, రహానె క్రీజులో పాతుకుపోయారు. ఇద్దరి మధ్యా చక్కటి సమన్వయం కుదరడంతో పరుగులు వేగంగా వచ్చాయి. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్‌ రూట్‌ బౌలర్లను మార్చినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ దశలో భారత జోడీ యథేచ్చగా ఆడింది. అటు స్టోక్స్‌ విసిరిన బౌన్సర్లను తెలివిగా ఆడుతూ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రహానె బ్యాటింగ్‌లోనూ ఆత్మవిశ్వాసం కనిపించడంతో ఇద్దరి మధ్య సెంచరీ (107) భాగస్వామ్యం ఏర్పడింది. ముందుగా 74 బంతుల్లో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేయగా ఆ తర్వాత రహానె 76 బంతుల్లో ఓ ఫోర్‌తో ఈ ఫీట్‌ సాధించాడు. రెండు గంటలపాటు నిలకడగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ, రహానె ఈ సిరీ్‌సలో తొలిసారిగా ఓ సెషన్‌లో వికెట్‌ పడకుండా చూడగలిగారు.

విరాట్‌ సెంచరీ మిస్‌..
టీ బ్రేక్‌ తర్వాత కోహ్లీ, రహానె మరింత దూకుడుగా ఆడడంతో ఓవర్‌కు దాదాపు నాలుగు రన్‌రేట్‌ చొప్పున పరుగులు వచ్చాయి. ముఖ్యంగా రహానె ఆటలో వేగం కనిపించింది. విరామం అనంతరం తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఇక 66వ ఓవర్‌లో రహానె రెండు ఫోర్లు సాధించగా, కోహ్లీ మరో ఫోర్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. కానీ తర్వాతి ఓవర్‌లో బ్రాడ్‌.. సుదీర్ఘంగా సాగుతున్న వీరి ఆటను దెబ్బతీశాడు. అవుట్‌సైడ్‌ వెళుతున్న బంతిని టచ్‌ చేయగా తొలి స్లిప్‌లో ఉన్న కుక్‌ మెరుపు వేగంతో స్పందించి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే సెంచరీవైపు దూసుకెళ్తున్న కోహ్లీని స్పిన్నర్‌ రషీద్‌ అవుట్‌ చేశాడు. కవర్‌డ్రైవ్‌కు ప్రయత్నించగా బంతి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని రెండో స్లిప్‌లో కాచుకుని ఉన్న స్టోక్స్‌ చేతిలో పడింది.

అదరగొట్టిన కుర్రాడు…
ఇక తొలి టెస్టు ఆడుతున్న రిషభ్‌ పంత్‌ తానెదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచి అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఎంతో అనుభవజ్ఞుడి తరహాలో ఇంగ్లండ్‌ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అబ్బురపరిచింది. ఎలాంటి బెరుకు లేకుండా వేగంగా పరుగులు తీస్తూ క్రీజులో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. బ్రాడ్‌ వేసిన 84, 86వ ఓవర్‌లో ఒక్కో ఫోర్‌ సాధించి తొలి రోజును అజేయంగా ముగించాడు. అయితే 87వ ఓవర్‌ చివరి బంతికి పాండ్యా వికెట్‌ను ఆండర్సన్‌ తీయడంతో తొలి రోజు ఆట ముగిసింది.
ఐదేళ్ల (2013) తర్వాత ఆసియా, విండీస్‌లో కాకుండా భారత్‌ తరఫున తొలి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం (60) నమోదైంది.
టెస్టుల్లో రహానె 3వేల పరుగుల (81 ఇన్నింగ్స్‌) మైలురాయిని దాటాడు.
ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో 90ల్లో అవుటైన మూడో భారత ఆటగాడు కోహ్లీ. గతంలో గంగూలీ (99), సచిన్‌ (92, 91) ఉన్నారు.
టెస్టు కెరీర్‌ను సిక్సర్‌తో ఆరంభించిన తొలి భారత ఆటగాడు రిషభ్‌ పంత్‌. ఓవరాల్‌గా 12వ క్రికెటర్‌.
భారత్‌పై టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌ ఆండర్సన్‌. మురళీధరన్‌ (105) టాప్‌లో ఉన్నాడు.
ఇంగ్లండ్‌లో తొలి రోజు ఆటలో భారత్‌కిది మూడో అత్యధిక స్కోరు (307/6).

నల్ల బ్యాండ్‌తో బరిలోకి ..
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌కు టీమిండియా ఘనంగా నివాళి అర్పించింది. దీనిలో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజున భారత ఆటగాళ్లు తమ చేతులకు నల్లటి బ్యాండ్స్‌ ధరించారు. ఈనెల 15న 77 ఏళ్ల వాడేకర్‌.. గురువారం వాజ్‌పేయి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారిగా వాడేకర్‌ నేతృత్వంలోనే భారత్‌ టెస్టు సిరీస్‌ విజయం అందుకుంది.
స్కోరుబోర్డు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: ధవన్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 35; రాహుల్‌ (ఎల్బీ) వోక్స్‌ 23; పుజారా (సి) రషీద్‌ (బి) వోక్స్‌ 14; కోహ్లీ (సి) స్టోక్స్‌ (బి) రషీద్‌ 97; రహానె (సి) కుక్‌ (బి) బ్రాడ్‌ 81; పాండ్యా (సి) బట్లర్‌ (బి) ఆండర్సన్‌ 18; రిషభ్‌ (బ్యాటింగ్‌) 22;
ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 87 ఓవర్లలో 307/6;
వికెట్ల పతనం: 1-60, 2-65, 3-82, 4-241, 5-279, 6-307;
బౌలింగ్‌: ఆండర్సన్‌ 22-8-52-1; బ్రాడ్‌ 21-6-64-1; స్టోక్స్‌ 15-1-54-0; వోక్స్‌ 20-2-75-3; రషీద్‌ 9-0-46-1