Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లిక్విడిటీ నిర్వహణకు వివిధ రకాలైన పద్ధతులను ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనది లిక్విడ్‌(అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా ఉండే) స్టాక్స్‌పై ఆధారపడటం. ఉదాహరణకు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఉన్నాయనుకుందాం. ఈ ఫండ్‌ తన నిధుల్లో వంద శాతాన్నీ స్మాల్‌ క్యాప్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయదు. మొత్తం నిధుల్లో 65 శాతం వరకే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మిగిలిన నిధులను ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇలాంటి ఇతర సాధనాల్లో లిక్విడ్‌ స్టాక్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. ఫండ్స్‌కు ఉండే మరో వెసులుబాటు… 5–10% నిధులను నగదు రూపంలో ఉంచుకోవడం.

ఈ నగదును స్వల్పకాలిక రుణ, ఓవర్‌నైట్‌ కాల్‌–మనీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇక నగదు రూపంలో కూడా ఎంతో కొంత రాబడిని ఫండ్‌ మేనేజర్లు సాధిస్తారు. సాధారణంగా ఫండ్స్‌ లిక్విడిటీ మొత్తం ఆయా ఫండ్స్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌పైననే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఓపెన్‌–ఎండెడ్‌ ఫండ్స్‌ల్లో ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. కొద్ది మంది మాత్రమే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకునే పెట్టుబడుల కంటే కూడా ఇన్వెస్ట్‌ చేసే నిధులే అధికంగా ఉంటాయి. ఇలా కాకుండా వచ్చే పెట్టుబడుల కంటే వెనక్కి తీసుకునే పెట్టుబడులే అధికంగా ఉంటే అప్పుడు ఫండ్‌ మేనేజర్లు ఆందోళన చెందుతారు. ఇలాంటి సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ అసలు ఉండవని చెప్పలేము.

ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు ఫండ్‌ మేనేజర్లు నగదును కానీ, స్వల్ప కాలిక రుణ సాధనాలపై కానీ, లిక్విడ్‌ స్టాక్స్‌పై కానీ ఆధారపడతారు. ఇలాంటి ఏర్పాటు లేకపోతే, ఫండ్‌ మేనేజర్లు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అయినకాడికి తెగనమ్మాల్సి వస్తుంది. మార్కెట్‌ రోజూ పతనమవుతున్నప్పుడు, ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై ఫండ్స్‌ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. అప్పుడు ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అమ్మక తప్పదు. దీంతో మార్కెట్‌ మరింతగా పతనమవుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి లిక్విడ్‌ స్టాక్స్‌లోనూ, స్వల్పకాలిక రుణ సాధనాల్లోనూ ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌ చేస్తారు.