Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల ఆర్మీ అధికారులపై షోపియన్‌లో దాఖలైన ఎఫ్ఐఆర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేసు నమోదు చేయడంపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆర్మీ మేజర్ ఆదిత్య కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్‌‌వీర్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. షోపియన్‌లో ఇటీవల ఆర్మీ వాహనంపై రాళ్లు రువ్వి ఆందోళన కారులపై సైనికులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు యువకులు మరణించడంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అక్కడి పోలీసులు కాల్పులకు మేజర్ ఆదిత్యనాథ్‌ను బాధ్యుడిని చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విధి నిర్వహణలో ఉన్న తమ కుమారుడిపై అక్రమంగా కేసు నమోదు చేశారనీ, దీన్ని కొట్టివేయాలంటూ ఆదిత్యనాథ్ తండ్రి సుప్రీంను ఆశ్రయించారు. సైనిక సిబ్బందిని, ఆర్మీ ఆస్తులను కాపాడుకునే క్రమంలోనే కాల్పులు జరిగాయని నివేదించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం… సదరు ఎఫ్ఐఆర్‌పై స్టే విధించింది. ఎఫ్ఐఆర్‌ ఆధారంగా మేజర్ ఆదిత్యపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.