Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘నాహం ప్రకాశః సర్వస్వ యోగమాయా సమావృతః’’
..‘యోగమాయ చేత ఆవరింపబడియున్నందున నేను అందరికీ గోచరింపను’ అని గీతలో భగవద్వాక్యం. భగవంతుడిని తెలుసుకోవాలనుకున్నప్పటికీ.. అభక్తుడు, మూఢుని ఎదుట రెండు తెరలుంటాయి. ఒకటి వారిమూఢత్వం. రెండవది భగవంతుని యోగమాయ. పరమాత్మ శక్తిసామర్థ్యాలు ప్రత్యక్షంగా చూచినా మూఢుడు గ్రహించలేడు. ద్రౌపదిని వివస్త్రను చెయ్యడానికి దుశ్శాసనుడు ఎంత బలాన్ని ఒడ్డినా చేతకాక చతికిలపడ్డాడు. ‘కృష్ణ కృష్ణ మహాయోగిన్‌ విశ్వాత్మన్‌ విశ్వభావన, ప్రపన్నాం పాహి గోవింద’ అని రోదిస్తూ పాంచాలి త్రికరణాలతో శ్రీకృష్ణునికి శరణాగతి చేసింది. పరమాత్మ అక్షయ వస్త్రాలిచ్చి ద్రౌపది మాన సంరక్షణ చేశాడు. వస్త్రంలో పోగులవలె విశ్వమంతా నిండి ఉన్న వాసుదేవుని వినూత్న, విలక్షణ వస్త్రావతారమిది. ‘న తత్ర తంతుః న చ తంతువాయః’ – ఈ వస్త్రానికి నూలూ తానే, నేతగాడూ తానే, మగ్గమూ తానే. రాయబార సందర్భంలో కురుసభలో విశ్వరూపం ప్రదర్శించి తన అనంత, అవ్యాహత ఐశ్వర్యాన్ని ప్రకటించాడు. అయినా, తమ అజ్ఞానం వలన దుర్యోధన, దుశ్శాసన, కర్ణాదులు భగవంతుని శక్తిని, ప్రార్థనా ప్రభావాన్ని, శరణాగతి విలక్షణత్వాన్ని గ్రహించి, భజించ లేక పోయారు. ఒక ఆడదాని వలువలు తీయలేని వారు ఇంక చెయ్యగలిగిందేముంటుంది? అని వారికి తోచదు. వారి దృష్టి అటుగా మళ్లదు. జీవుడు తన అజ్ఞానం తొలగించుకోగల్గినా యోగమాయను మాత్రం తనకుతానుగా దాటలేడు. శరణాగతి వలన అజ్ఞానం నశించడంతో పాటు భగవదనుభవం (సాక్షాత్‌ దర్శనం) కూడా కల్గుతుంది. ‘మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరన్తితే’ భగవంతుని నిరంతర ధ్యానం, భగవద్‌ విధానంలో సంతృప్తి, భగవదాజ్ఞా పాలనం, నిష్కామ భావం.. ఈ అనుష్ఠానమే శరణాగతి. వేదసారం ఉపనిషత్తులు. ఉపనిషత్‌సారం గీత. గీతాసారం శరణాగతి. సర్వసాధనలకి చరమ పరిణతి. ఆరాధనకి అంతిమ సోపానం. శ్రీకృష్ణః శరణం మమ.