Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆరు నెలల తప్పనిసరి నిరీక్షణ గడువు అవసరం లేకుండానే ఓ దంపతులు విడిపోయేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. విడాకులు కోరుతూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు వారు మనసు మార్చుకునేందుకు వీలుగా ఈ గడువును ఇవ్వాల్సి ఉంది. రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం లభించిన అసాధారణ అధికారాన్ని ఉపయోగించి… జస్టిస్‌ కురియెన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ల ధర్మాసనం మాత్రం ఓ జంటకు వెన్వెంటనే విడాకులు మంజూరు చేసింది. స్నేహితుల్లా విడిపోయేందుకు వారు వివేకంతోనే నిర్ణయం తీసుకున్నారని తాము విశ్వసిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొని, తీర్పును వెలువరించింది. 2016లో దిల్లీలో వివాహం చేసుకున్న ఈ జంట ఒక నెల రోజులు కలిసి ఉన్నా ఆ తర్వాత వివాదాల కారణంగా విడిపోయారు. విడాకులు కోరుతూ భర్త పిటిషన్‌ దాఖలు చేశారు. 2017 డిసెంబరులో గుజరాత్‌లోని ఆనంద్‌లో భార్య ఒక ఫిర్యాదు దాఖలు చేసింది. బదిలీ అర్జీ ద్వారా కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది. ‘దంపతులిద్దరూ విద్యావంతులు. వారితో సుదీర్ఘంగా మాట్లాడాం. విడాకులపై వారెంతో స్పష్టతతో ఉన్నారు. వారి మధ్య ఉన్న వివాదాల నేపథ్యాన్ని చూశాక వారిని ఇంకో ఆరు నెలలు నిరీక్షించాలని చెప్పడంలో అర్థం లేదని మేం భావిస్తున్నాం. వ్యాజ్యం బదలాయింపు పూర్తయ్యే వ్యవధిలో భర్త నుంచి భార్యకు రూ.12.50 లక్షలు డీడీ రూపంలో అందింది. దానిని ఆమె ధ్రువీకరించింది’ అని తెలిపింది.