Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రివేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు.

బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథాపూర్వ స్థానానికే చేరుకుంటారు.అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలికాడట. విష్ణువు సత్యం పలుకుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు నిరసించడంతో, ఆ శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడట. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలలవాడయ్యాడని, అనంతరం బ్రహ్మవిష్ణువులిద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.

శివపూజారంభంలో భక్తుడు తనలో శివుణ్ని భావించుకుంటాడు. తనతో పాటు ఈ సమస్త ప్రపంచం శివమయం అని విశ్వసించి పూజించే పద్ధతినే ‘ఆత్మపూజ’ అంటారు. శంకర భగవత్పాదులు ‘శివానంద లహరి’లో ఈ పూజా విధానాన్ని వర్ణించారు. ‘ఓ పరమేశ్వరా! నా ఆత్మ నీవు. నా బుద్ధి పార్వతీదేవి. నా ప్రాణాలే మిత్రులు. నా శరీరమే ఇల్లు. నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు. నా నిద్రే తపస్సు. నా సంచారమే నీకు ప్రదక్షిణం. నేను పలికే మాటలే నీ స్తోత్రాలు. నేను చేస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే!’- ఈ మాటల్లో ఎంతో పరమార్థం ఉంది.

మనిషి శివుణ్ని నిష్కల్మషంగా పూజించాలనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్లు భావించాలి. మనిషి శివారాధనలో చతుర్విధ ముక్తులూ పొందుతాడని శంకర భగవత్పాదుల ఉపదేశం. భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి ‘సారూప్యం’ (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది సారూప్య ముక్తి. శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివాలయాల్ని సందర్శించడం వల్ల ఆయన సమీపానికి చేరుకున్నట్లు అవుతుంది కనుక ఇది సామీప్య ముక్తి. ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది. శివుడితో మానసికమైన అనుసంధానం ఉంటుంది. ఆ కారణంగా ‘సాయుజ్య ముక్తి’ లభించినట్లే. ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తులనూ ఇహలోకంలోనే పొందుతున్న మనిషి ధన్యుడు.

శివుడి అర్చనలోని వస్తువులన్నీ ఆయన ప్రసాదించినవే. శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది. శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి. శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి. బిల్వదళాలు చేతికి అందుతున్నాయి. అవన్నీ శివ ప్రసాదాలే!

ఇలా శివుడు ఇచ్చిన సంపదలన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దాని పరమార్థం- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదని, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియజేసేదే మహాశివరాత్రి!

అనునిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంలా రూపొందించాలి. తనలో అందరిని, అందరిలో తనను చూసుకొని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావించడమే అతడి కర్తవ్యం. మహాశివరాత్రి పర్వదినం అందజేసే సందేశం ఇదే! ఈ శివభావనతో పరమశివుణ్ని ఆరాధిస్తేనే, లోకమంతా శివ(మంగళ)మయం అవుతుంది!