Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. గత నెలలో ఈ విషయంపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుపై ప్రతికూల స్పందన పర్వం కొనసాగుతోంది. తాజాగా సోమవారం జాతీయ అయ్యప్ప స్వామి భక్తుల సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తే ఆలయ ఆచారాలు దెబ్బతింటాయిని పిటిషన్‌ దారులు పేర్కొన్నారు.‌

‘సుప్రీం తీర్పు అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. వారి ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉంది. సుప్రీం తీర్పు ప్రజా గొంతుకకు పొంతన లేదు’ అని తమ పిటిషన్‌లో పేర్కొన్నామని ఆ సంఘం ప్రెసిడెంట్‌ శైలజా విజయన్‌ తెలిపారు.

అయితే సుప్రీం తీర్పును అనుసరించి అందరితో చర్చించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాత మాత్రమే అమలు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు గైర్హాజరు అవ్వాలని ఆలయ ప్రధాన పూజారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తేగానీ చర్చల్లో పాల్గొనమని ప్రధాన పూజారులు ఆదివారం స్పష్టం చేశారు. అయితే పూజారులు డిమాండ్లపై గానీ, అటు రివ్యూ పిటిషన్‌పై గానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు.