Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళవారం (జనవరి 9) సాయంత్రం.. మోదీతో అరగంట పాటు సమావేశమైన నరసింహన్ పలు విషయాలపై చర్చించారు. తెలుగు రాష్ర్టాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించారు. కేంద్రం అనుమతుల వల్ల కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల పురోగతి బాగుందని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో శాంతిభద్రతలు బాగున్నాయి తెలిపారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్, భూదస్ర్తాల ప్రక్షాళన సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పినట్లు సమాచారం.

విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ సానుకూలత వ్యక్తం చేసినట్లు మోదీతో గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా కలిసిన కేసీఆర్, చంద్రబాబు పలు విషయాలపై చర్చించారని తెలిపారు.

అంతకుముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన గవర్నర్ నరసింహన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక సమర్పించారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విభజన చట్టంలో కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. రాజ్ భవన్ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు కొన్ని సూచనలు చేశాం’ అని తెలిపారు.

ప్రజలకు రాజ్‌భవన్‌ను మరింత చేరువ చేస్తామని, పచ్చదనం-పరిశుభ్రత అంశాలపై దృష్టి పెట్టామని నరసింహన్ తెలిపారు. టీకాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అవి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థల లాంటివి. పెద్దలు, పిల్లల మధ్య తలెత్తే అపార్థాలు మళ్లీ సర్దుకుంటాయి’ అని వ్యాఖ్యానించారు.