Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దిల్లీ: భారత్‌లో డ్రోన్లను విదేశీయులు నేరుగా నిర్వహించడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు లీజుకిచ్చి మాత్రమే వారు వాటిని నిర్వహించుకోవచ్చు. ఈ విషయాన్ని విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) స్పష్టం చేసింది. భారత్‌లో డ్రోన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ఈ విధానం డిసెంబరు 1నుంచి అమల్లోకి వస్తుంది. ‘‘వాణిజ్య అవసరాల కోసం రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ (ఆర్‌పీఏఎస్‌)ను విదేశీయులు భారత సంస్థకు లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు భారత సంస్థలు ఆ డ్రోన్‌కు విశిష్ఠ గుర్తింపు సంఖ్య (యూఐఎన్‌), అనుమతిని (అన్‌మాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్‌ పర్మిట్‌-యూఏఓపీ)ని తెచ్చుకుని  ఉపయోగించాల్సి ఉంటుంది.’’ అని డీజీసీఏ వివరణ ఇచ్చింది.

పౌర అవరాలకు ఉపయోగించే డ్రోన్లను వాటి బరువును అనుసరించి ఐదు రకాలుగా వర్గీకరించారు-నానో, మైక్రో, స్మాల్‌, మీడియం, లార్జ్‌.
నానో డ్రోన్లు (250 గ్రాముల కన్నా తక్కువ బరువు), జాతీయ సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన సంస్థ, కేంద్ర నిఘా సంస్థలు ఉపయోగించే డ్రోన్లు మినహా మిగిలినవాటికి వాటి సొంతదారులు, ఎగరవేసేవారు నమోదు చేయించుకోవడం తప్పనిసరి.
నానో తరహా మినహా మిగిలిన డ్రోన్లకు డీజీసీఏ నుంచి విశిష్ఠ గుర్తింపు సంఖ్య (యూఐఎన్‌)ను కచ్చితంగా పొందాలి. నానో మినహా మిగిలిన వాటిని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ప్రతిసారీ ప్రతిపాదిత డిజిటల్‌ గగన వేదిక నుంచి అనుమతి (యూఏఓపీ) తీసుకోవాలి.
ప్రస్తుతానికి డ్రోన్ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను సరఫరా చేసేందుకు అనుమతి లేదు.
డ్రోన్లను వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా అనుమతించేవరకూ క్రిమిసంహారక మందుల పిచికారీకి వాటిని ఉపయోగించరాదు.
భవంతిలోపల డ్రోన్లను ఉపయోగించాలన్నా నమోదు తప్పనిసరి.
పగలు మాత్రమే వీటిని ఉపయోగించాలి. వివిధ షరతులకు లోబడి మైక్రో డ్రోన్లను(బరువు 250 గ్రాముల నుంచి 2 కిలోల మధ్య) రాత్రి పూటా   వినియోగించవచ్చు.
డ్రోన్లను వినియోగించేముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడమూ తప్పనిసరి.
పెళ్లిళ్లలో ఫొటోలు తీయడానికి మైక్రోడ్రోన్లను ఉపయోగించినా వాటికీ యూఐఎన్‌ పొందాలి. గగనతలం పరంగా నిషేధం లేని చోట, చుట్టూ మూసి ఉన్న ఆవరణల్లో భూ ఉపరితలానికి 200 అడుగుల ఎత్తులోపు ఉపయోగించేటట్లయితే యూఏఓపీ అవసరం లేదు. పోలీసులకు మాత్రం సమాచారం అందించాలి. గగనతల నియంత్రణలు ఉన్న చోటయితే యూఏఓపీ కూడా అవసరం.
అన్ని రకాల పౌర వినియోగ డ్రోన్లను కంటికి కనపడే దూరం వరకే (సాధారణంగా 450 మీటర్లు) ప్రయోగించాలి.
విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దులు, సముద్ర తీరప్రాంతం, రాష్ట్ర సచివాలయ ఆవరణలు, వ్యూహాత్మక ప్రదేశాలు, సైనిక సంస్థలు, ఇతర ముఖ్య సంస్థలు, దిల్లీలోని విజయ్‌ చౌక్‌ చుట్టుపక్కల పౌరడ్రోన్లను ఉపయోగించరాదు.