Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆకలికి కులం, మతం, ప్రాంతం అనే వ్యత్యాసం ఉండదు. ఆకలి ఎవరికైనా ఆకలే. ఈ రోజున నలుగురికీ అన్నం అందిస్తున్న నా ఆలోచనకు ప్రేరణ 2012లో కలిగింది. ఒక రోజు నేను హైదరాబాద్‌లోని డబీర్‌పుర రైల్వేస్టేషన్‌ నుంచి స్కూటర్‌ మీద వస్తున్నాను. టైరు పంక్చర్‌ కావడంతో స్కూటర్‌ అక్కడే పెట్టి నడవడం మొదలుపెట్టాను. నడుస్తున్న నాకు రోడ్డు పక్కన కదల్లేని స్థితిలో పడి ఉన్న ఒక 70 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తిని ‘ఆమెకి ఏమైంద’ని అడిగాను. ‘ఆమెకి చెవులు వినిపించవు. నడవలేదు. ఆమె కొడుకు ఎటో పోయాడు. పాపం… రెండు రోజులుగా ఆకలితో ఉంద’ని చెప్పాడతను. ‘మరి నువ్వే ఆమెకి అన్నం పెట్టొచ్చు కదా’ అని అతడితో అన్నాను. దానికి అతను ‘నాకే లేదు. ఎక్కడి నుంచి తెచ్చేది’ అన్నాడు. ఆ మాటలు విన్న నా మనసు చలించిపోయింది. వెంటనే సమీపంలో ఉన్న హోటల్‌ నుంచి అన్నం పార్శిల్‌ తీసుకొచ్చి వాళ్లకి తినిపించా. అప్పుడే అల్లాను – ఆకలితో ఉన్న వాళ్లకి అన్నం పెట్టే శక్తి ఇవ్వమని కోరుకున్నాను. ఇంటికి వెళ్లాక కూడా అవే ఆలోచనలు. బాల్యంలో ఆకలితో ఎన్నో రోజులు అల్లాడిపోయాను. అలా నాకు మల్లే బాధపడుతున్న వాళ్లలో కొందరికైనా అన్నం పెట్టి ఆకలి తీర్చాలనుకున్నాను. అదే ఏడాది ‘సని వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటుచేశాను.
రోజుకి రూపాయి సంపాదనతో…
ఫౌండేషన్‌ గురించి చెప్పేముందు నా బాల్యం గురించి చెప్పాలి మీకు. మాది నిరుపేద కుటుంబం. నాకు ఊహ తెలియని వయసులో మా నాన్న క్షయవ్యాధితో మరణించాడు. ఆయన ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. నాతో కలిసి నలుగురం అన్నదమ్ములం. ఒక చెల్లులు. అమ్మ కుటుంబ భారాన్ని మోయలేకపోయింది. అమ్మా వాళ్ల నాన్న కొంత ఆర్థికసాయం చేసేవాడు. మా పెద్దన్న మార్బుల్‌ ఫిటింగ్‌ పనికి వెళ్లే వాడు. రెండో అన్న అత్త ఇంట్లో ఉండే వాడు. మూడోవాడిని నేను. నా తరువాత ఒక తమ్ముడు, చెల్లి. నేను చంచల్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ మీడియంలో ఐదో తరగతి దాకా చదువుకున్నా. పూటగడవడం కష్టంగా ఉండేది. రెండుమూడు రోజులు పస్తులుండేవాళ్లం. అప్పుడు అమ్మ ‘కొడుకా ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకురా. చదువు గురించి తరువాత ఆలోచిద్దాం’ అంది. అలా పన్నెండేళ్లున్నపుడు టైలర్‌ షాపులో బటన్లు కుట్టే పనిలో చేరా. రోజుకి ఒక రూపాయి నా సంపాదన. నాకు పదిహేడేళ్లు వచ్చాక సొంతంగా టైలర్‌ షాపు పెట్టుకున్నా. అలా ఐదేళ్లు చేశాను. ప్యాంటు, షర్టు కుడితే 120 రూపాయలు వచ్చేవి. అందులో ఖర్చులు పోను 50 నుంచి 60 రూపాలయు మిగిలేవి. అలానే గడిస్తే ఎలా ఉండేదో జీవితం! రెడీమెడ్‌ ప్యాంట్లు, షర్ట్‌ రాకతో మా గిరాకీ తగ్గిపోయింది. అప్పుడు దిల్‌సుఖ్‌నగర్‌లో గ్లాస్‌ ఫిట్టింగ్‌ కాంట్రాక్టర్‌ వద్ద సబ్‌ కాంట్రాక్టర్‌గా చేరి మరో ఐదేళ్లు పనిచేశా. అప్పుడు రోజుకి 40 రూపాయలు ఇచ్చేవారు. ఆ పని చేస్తున్నప్పుడు ఎడమచేయి తెగడంతో మా అమ్మ ‘వేరే పని చూసుకో’మని చెప్పింది. దాంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పిఒపి) పనివైపు వెళ్లాను. ఏడాదిలోనే ఆ పనిలో పట్టు సాధించా. తరువాత పెళ్లి చేసుకున్నా. ‘సని ఆర్ట్‌ డెకరేటర్‌’ పేరుతో చంచల్‌గూడలోనే షాపు ఏర్పాటు చేసుకుని… నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇక ఫౌండేషన్‌ వివరాల్లోకి వెళ్తే…
రంజాన్‌లో రెండు పూటలా…
మే, 2012లో ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాను. ప్రారంభంలో అద్దె గిన్నెలు తీసుకుని ఇంట్లోనే అన్నం, పప్పు వండి ప్యాకెట్లు చేసేవాణ్ణి. వాటిని డబీర్‌పుర రైల్వే స్టేషన్‌ ఆనుకుని ఉన్న బ్రిడ్జి కింద ఉండే నిరుపేదలకు ఇచ్చేవాణ్ణి. అప్పట్నించి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజూ ఆ పనిని ఆపలేదు. వాళ్లందరికీ పెట్టాకే ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తా. మొదట్లో ఓ నలభై మందికి భోజనం పెట్టేవాణ్ణి. ఇప్పుడు సుమారుగా వంద నుంచి 130 మంది వరకు పెడుతున్నా. ఏ మతానికి చెందిన పండుగ వచ్చినా జీరా రైస్‌, వెజ్‌ బిర్యానీ పెడతాను. రంజాన్‌ మాసంలో రెండు పూటలా భోజనం పెడతాను. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలవరకు, రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆహారం అందిస్తున్నా. కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేద ముస్లింలు హైదరాబాద్‌కి వచ్చి జకాత్‌ తీసుకుంటారు. అలా వచ్చిన వాళ్లంతా డబీర్‌పుర ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద తలదాచుకుంటారు. వాళ్లలో కొందరు ఉపవాసం ఉంటారు. నేను మధ్యాహ్నం ఒక పూటే భోజనం పెడితే ఉపవాసం ఉన్న వాళ్లకి అన్నం దొరకదు. అందుకనే రంజాన్‌ మాసంలో రెండు పూటలా భోజనం పెడుతున్నా.
భోజనంతో పాటు మరెన్నో కార్యక్రమాలు
నేను చేస్తున్న ఈ పనిని పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి గమనించి తన సోదరుడితో 8 రోజులు సర్వే చేయించి, నమ్మకం కుదిరాక 25 కిలోల రైస్‌ బ్యాగులు 15 ఇచ్చాడు. సాయం చేయాలి అనుకునే వాళ్లు బియ్యం, వంటనూనె, కందిపప్పు వంటి సరుకులు ఇస్తే చాలు. ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని సరుకులు కొని రశీదులు ఇస్తాము. ఫేస్‌బుక్‌లో azhar maqsusi పేజీ ద్వారా కొందరు చేయూతనిస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో, గువాహటిలో ఉచిత టైలరింగ్‌ శిక్షణా కేంద్రాలు నడుపుతున్నాం.
అభినందన మందారాలు
  •  నిరుపేదల ఆకలి తీర్చేందుకు మద్యాహ్న బోజన కేంద్రాన్ని నిర్వహిస్తున్న తీరుపై స్టార్‌ ప్లస్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించిన ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ కార్యక్రమానికి ఆహ్వానించారు.
  •  భారత మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు స్వయంగా మా కార్యక్రమానికి వచ్చి అన్నం వడ్డించారు.
  •  జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు ప్రశంసించడంతోపాటు బియ్యం బస్తాలను తన వంతుగా అందజేశారు.
  •  త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి 60వ వసంత వేడుకల్లో ఉత్తమ సంఘ సేవకుని పురస్కారం
  •  రామకృష్ణ మఠానికి చెందిన బోధమయానంద స్వామి నుంచి రియల్‌ లైఫ్‌ హీరో అవార్డు.
  •  దుబాయిలో ఉత్తమ సంఘ సేవకుని అవార్డును అందుకోగా, మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ‘హ్యుమానిటీ ఫస్ట్‌ ఫౌండేషన్‌’ ఉత్తమ సంఘ సేవకుని అవార్డుతో సత్కరించారు.
  •  బెంగళూరులో జరిగిన సౌత్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో రియల్‌ లైఫ్‌ హీరో అవార్డు