Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అనాదిగా దేవతా ప్రసన్నతను పొందడానికి అనుసరిస్తున్న అనేక పద్ధతులున్నాయి. వీటిలో ప్రధానమైనది దక్షిణాచారం. వేదమార్గాన్ని అనుసరించి, మోక్షాన్ని కోరుకుంటూ, శాంతియుతమైన, నిర్వికారమైన మార్గాల్లో చేసే ఆరాధన దక్షిణాచారం. వామాచారం దీనికి పూర్తిగా విరుద్ధం. దీనిలో తంత్ర పద్ధతులకు ప్రాధాన్యం ఉంటుంది. పంచ ‘మ’కారాలు వామాచారానికి కీలకమని పండితులు చెబుతారు. అవి మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం. ఇలాంటి ఆహార విహారాలతో ఆరాధన చేస్తే దేవతలు సులువుగా ప్రసన్నమవుతారనీ, ఐహికమైన కోరికలు వేగంగా సిద్ధిస్తాయనీ ఈ మార్గాన్ని అనుసరించే సాధకుల నమ్మకం. నిజానికి వామాచార పద్ధతులు వేలాది సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేవి. వాటిలో అనేక రకాలున్నాయి. ముఖ్యమైన రకాలు అయిదు (కౌలము, వామము, చీనము, సిద్ధాంతము, శాంబరము) అని ‘మేరు తంత్రం’ అనే ప్రాచీన గ్రంథం వివరిస్తోంది. హింస, వాంఛ, పశుత్వం, రాక్షసత్వం, వావివరుసలు లేని విశృంఖలత్వం వామాచారంలో ప్రధాన అంశాలనీ, ఇవి ఆమోదయోగ్యం, అనుసరణీయం కాదనీ ఆ గ్రంథం పేర్కొంటోంది.
ఆది శంకరాచార్యుల కాలం నాటికి వామాచారాన్ని అనుసరించేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదనీ, కొన్ని ఆలయాలు కేవలం తాంత్రిక, వామాచారాలకే ప్రత్యేకించి ఉండేవనీ పెద్దలు అంటారు. ఆ ఆలయాల్లో ఉగ్రరూప దేవతలను శ్రీచక్ర ప్రతిష్ఠాపన ద్వారా శాంతమూర్తులుగా శంకరాచార్యులు మార్చారనీ, దక్షిణాచారాన్ని అనుసరించి ఆగమ యుక్తమైన పూజావిధానాలను నిర్దేశించారనీ చెబుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారికి శైలిపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాలరాత్రి, భైరవీ, సర్వసిద్ధి అనే తొమ్మిది పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో వామాచార విధానంలో ఒకప్పుడు ఈ అమ్మ వారికి పూజలు జరిగేవి. వామాచారం… అంటే జంతు బలుల వంటి తాంత్రిక విధానాలు. ఇలా చేయడం వల్ల అమ్మవారు భీకర స్వరూపిణిగా ఉంటారనే ఉద్దేశంతో, ఆదిశంకరులు ఆ పేర్లను మార్చి వేసి, అమ్మవారికి లలితా రూపాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ సాత్విక పూజలు జరుగుతున్నాయి.