Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు. శ్రీ హరి కూడా ఉండడు. అతిథులకు భోజన సత్కారాలు జరగనిచోట. లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళ లాడుతూ ఉండనిచోట, ఇల్లాలు కంటతడి పెట్టినచోట, హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరంగా గడ్డిపరకలను తెంచినా, పచ్చటి చెట్లను పడగొట్టినా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో భోజనం చేసే వారిని లక్ష్మి వరించదు. పశుపక్షులను హింసించే చోట వుండనే వుండదు. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు. మరి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ వుంటుందంటే, శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్నచోట, కష్టపడి పని చేసే వారి ఇంట, ఆశావాదుల ఇంట, ధనాత్మకమైన ఆలోచనలు చేసే వారి ఇంట, ప్రేమానురాగాలతో పిలుచుకునే వారి ఇంట, అతిథులతోనూ, తోటివారితోనూ ఆత్మీయంగా మసలుకునే వారి ఇంట లక్ష్మి విరాజిల్లుతుంది.

అన్నిటి కంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా  శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన అధీనంలో ఉండాలి కాని, మనం సంపద అధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. లక్ష్మి అంటే, ఒక వృత్తిదారుడికి చేతినిండా పని దొరకడం, కష్టపడి పని చేసేవారికి తగిన ప్రతిఫలం లభించడం, పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం ఆరోగ్యం, విద్యార్థులకు తగిన సీట్లు లభించడం, ఇల్లాలికి భర్త అనురాగం, పిల్లల ప్రేమ లభించడం కూడా లక్షే్మ.