Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తన మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లు చెప్పడంలోనూ, ఎదుటివారిపై విమర్శలు చేయడంలోనూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్టయిలే వేరు. మనసులో ఏమీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. వాళ్లు స్వపక్షమా, విపక్షమా అని చూడరు. తాజాగా మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంపై తనదైన శైలిలో స్పందించారు. రైల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. చెయ్యి ఎత్తమంటే తాము ఎత్తాలని… దించమంటే దించాలని, అంతకు మించి తాము చేయగలింది ఏమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడలో ఎంపీలతో రైల్వే శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు.

రైల్వే జోన్‌పై ప్రకటించాల్సింది ప్రధాని మోదీనే అని జేసీ వ్యాఖ్యానించారు. మనిషికి కొంచెం భయం ఉంటేనే అన్నీ వస్తాయని… భయం లేకపోతే ఆ వ్యక్తిలో విచ్చలవిడితనం పెరిగిపోతుందని పరోక్షంగా మోదీని విమర్శించారు. అవసరాన్ని బట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని… ఇది సరైన విధానం కాదని దుయ్యబట్టారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ఏ మాట్లాడుతాడో ఆయనకే తెలియదు.. తిప్పడం తప్ప మరొకటి రాని తిక్కలోడని అభివర్ణించారు. ఓట్లు కావాలనుకునేవాడు పట్టిసీమను వ్యతిరేకించడం ఏంటి… నిరక్ష్యరాసుడు సైతం పట్టిసీమ, పోలవరం కావాలని కోరుకుంటే జగన్ మాత్రం విమర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.