Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సహా మరో నాలుగు విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతుల కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) వేచిచూస్తోంది. రూ.3,258 కోట్లతో ఈ విమానాశ్రయాల విస్తరణకు ఎఎఐ ప్రణాళికలు రూపొందించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈసి) తాజా సమావేశ వివరాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పాట్నా, లక్నో, డెహ్రడూన్‌, జబల్‌పూర్‌ విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ ఎఎఐ కోరినట్లు ఈసి సమావేశ వివరాల్లో ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ విమానాశ్రయ విస్తరణకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించేందుకు అనుమతినివ్వాలని కోరింది. విజయవాడ విమానాశ్రయంలో రూ.500 కోట్ల పెట్టుబడితో కార్‌ పార్కింగ్‌, యుటిలిటీ భవనాలు, నగరంలోకి వెళ్లేందుకు నాలుగు వరుసల అప్రోచ్‌ రహదారి, ప్రయాణికుల ప్రాంగణం సహా కొత్త టెర్మినల్‌ భవనాన్ని నిర్మించేందుకు ఎఎఐ ఇప్పటికే ప్రణాళికను సమర్పించింది.
2015-16లో విజయవాడ విమానాశ్రయం నుంచి 3.98 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా 2021-22 నాటికి ఈ సంఖ్య 14.87 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా లక్నో విమానాశ్రయంలో టెర్మినల్‌ -1 ని కూల్చివేసిన అనంతరం టెర్మినల్‌-3 బిల్డింగ్‌ను నిర్మించాలని ఎఎఐ భావిస్తోంది. ప్రస్తుతమున్న టెర్మినల్‌ దేశీయ, విదేశీ ప్రయాణికులకు సరిపోకపోవటంతో రూ.1,383 కోట్లతో కొత్త టెర్మినల్‌ను నిర్మించాలని నిర్ణయించినట్లు ఎఎఐ పేర్కొంది.
లక్నో విమానాశ్రయానికి సంబంధించి ఎఎఐను కొన్ని వివరాలను కోరగా వాటిని సమర్పించిందని, తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల కోసం ఇఐసి సిఫారసు చేసిందని అప్రైజల్‌ కమిటీ పేర్కొంది. వీటితో పాటు పాట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (జెపిఎన్‌ఐ) నుంచి ఏటా 45 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా కొత్త టెర్మినల్‌ను ఏర్పాటు చేసేందుకు ఎఎఐ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతమున్న టెర్మినల్‌ 20 సంవత్సరాలకు పైబడినది కావటంతో కొత్త సదుపాయాలు, టెక్నాలజీలతో రూ.865 కోట్ల పెట్టుబడితో కొత్త టెర్మినల్‌ను నిర్మించాలని చూస్తున్నట్లు ఎఎఐ తెలిపింది