Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత ఆర్మీతో కలసి పని చేయడానికి రష్యా ఆర్మీ అమితాసక్తి కనబరుస్తోందని భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ అన్నారు. భారత్‌ తనదైన విధానాలను పాటిస్తుందని అమెరికా వంటి దేశాల ఒత్తిడికి ప్రభావితం కాదని స్పష్టం చేశారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ‘భారత ఆర్మీతో కలిసి పని చేయడానికి రష్యా ఆర్మీ చాలా ఆసక్తి కనబరుస్తోంది. ఎందుకంటే, మన దేశానికి ఏ విధానం మంచి చేస్తుందో దాని వైపున మాత్రమే నిలబడే సమర్థత మనకు ఉంది. అమెరికా పెడుతున్న ఆంక్షల గురించి ఎలా స్పందిస్తారని రష్యా ఇటీవల అడిగింది. భారత్‌పై ఆంక్షలు పెట్టినా స్వతంత్ర విధానాన్నే అవలంబిస్తుందని చెప్పాము. ఆధునిక సాంకేతికతను పొందే విషయంలో అమెరికాతో కలసి భారత్‌ పని చేస్తున్నప్పటికీ, స్వతంత్ర విధానాన్నే పాటిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నప్పటికీ.. రష్యా నుంచి ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్‌ రెండు రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు ఒప్పందం జరిగింది. 5.3 మిలియన్ అమెరికన్‌ డాలర్లతో చేసుకున్న ఈ ఒప్పందం విషయంపై భవిష్యత్తులో అమెరికా నుంచి భారత్‌ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. మేము రష్యా నుంచి కామోవ్‌ హెలికాప్టర్లను కూడా పొందాలని అనుకుంటున్నాం. ఇతర రక్షణ వ్యవస్థలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం’ అని జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. కాగా, ఇటీవలే ఆయన రష్యాలో ఆరు రోజులపాటు పర్యటించి అక్కడి ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు.