Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల ప్రదర్శనపై కోచ్‌ శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్య

న్యూఢిల్లీ: కబడ్డీ ప్రపంచస్థాయి క్రీడగా ఎంతగా పరిణామం చెందిందో చెప్పేందుకు తాజా ఆసియా క్రీడల ఫలితాలే నిదర్శనమని భారత మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ లింగంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కబడ్డీకి కంచుకోట అయిన భారత జట్ల ఓటమి… గ్రామీణ క్రీడలో ప్రపంచ దేశాలు పురోగమనాన్ని తెలుపుతోందని అన్నారు. ఆసియా క్రీడల చరిత్రలోనే కబడ్డీ ఈవెంట్‌లో భారత్‌ స్వర్ణం లేకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత పురుషుల జట్టు సెమీస్‌లో ఇరాన్‌ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకోగా… మహిళల జట్టు ఫైనల్లో 24–27తో ఇరాన్‌ చేతిలోనే ఓడిపోయి రజతంతో తృప్తిపడింది. ఈ ఫలితాలు నిరాశ కలిగించాయన్న శ్రీనివాస్‌రెడ్డి రజత, కాంస్యాలను సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయని చెప్పారు. ‘మేం ఎప్పుడూ స్వర్ణం కోసమే బరిలోకి దిగాం. మహిళల విభాగంలో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోవడం బాధిస్తోంది. కబడ్డీ ఆట విశ్వవ్యాప్తమైంది.

ఇందులో పతకం సాధించేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి’ అని తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన వివరించారు. కబడ్డీ ప్లేయర్లకు గుర్తింపు కూడా లేని దశ నుంచి ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు ఈ క్రీడను ఆడే స్థితికి ఆట అభివృద్ధి చెందిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘2014లోనే చైనీస్‌ తైపీ కబడ్డీ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఆ దేశం పతకం బరిలో నిలుస్తోంది. దీన్ని బట్టే కబడ్డీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పొచ్చు. ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ల అర్జున అవార్డు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఒకానొక సమయంలో మిల్కాసింగ్‌ నేతృత్వంలోని కమిటీ కేవలం ఐదారు దేశాలు ఆడే కబడ్డీకి అర్జున అవార్డు ఇవ్వటమేంటని ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రస్తుతం 40 దేశాలు ఈ క్రీడలో సత్తా చాటుతున్నాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌ ద్వారా స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. భారత ఆటగాళ్ల ఆటను విదేశీ ప్లేయర్లు శ్రద్ధగా గమనిస్తున్నారని, ఇక మనవాళ్లు మరింత కఠినంగా శ్రమించాల్సి ఉందని పేర్కొన్నారు.

కొన్నేళ్ల కఠోర శ్రమ అనంతరం ఇరాన్‌ జట్టు స్వర్ణం గెలిచిందని అన్నారు. ప్రస్తుతం ఆ జట్టుకు భారత్‌కు చెందిన శైలజా జైన్‌ కోచ్‌గా ఉండటంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుందని వివరించారు. ‘భారత్‌ నుంచి చాలామంది కోచ్‌లు ఇరాన్‌కు వెళ్లారు. ఆరు నెలల కాలంలోనే పటిష్టమైన జట్టును తయారు చేయడం ఏ కోచ్‌కూ సాధ్యం కాదు. గతంలో చేసిన కృషి ప్రస్తుతం ప్రతిఫలిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టుకు శైలజా జైన్‌ కోచ్‌గా ఉండటంతో ఆమెకు ఆ ఖ్యాతిని ఇస్తున్నారు’ అని ఆయన విశ్లేషించారు.