Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలి 18 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ రెండు పిల్లర్లు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఫ్లైఓవర్‌ స్లాబ్‌ కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు అక్కడికి తరలివచ్చాయి. భారీ క్రేన్లను వినియోగించి కాంక్రీటు శిథిలాలను తొలగిస్తున్నారు.

బాధితుల్లో ఫ్లై ఓవర్‌ పనుల్లో పాల్గొన్న సిబ్బందే ఎక్కువమంది ఉన్నారు. క్షతగాత్రుల్లో 18 మంది చనిపోగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. శిథిలాల్లో మరికొంతమంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్‌ పొడవైన ఈ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఘటనపై 48 గంటల్లోగా విచారణ నివేదికను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం యోగితో మాట్లాడి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.