Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కార్పొరేటు ఉద్యోగులు.. నాలుగంకెల జీతం.. వచ్చే సంపాదనతో తాము హాయిగా ఉంటే చాలనుకోలేదు… వీళ్లు. పేద బాలికల ఇంట విజ్ఞాన జ్యోతి వెలిగించాలనుకున్నారు. 150 మంది కలిసి సంకల్ప్‌ పేరిట ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. తమ జీతం డబ్బులతో పాటు నిధుల సేకరణ చేపట్టారు. పది, ఇరవై కాదు… 280 మంది పేద బాలికలను చదివిస్తున్నారు. సంకల్పం ఉంటే వందల మందికి సేవ చేయవచ్చునని నిరూపిస్తున్నారు.
 బంజారాహిల్స్: కొంత మంది కార్పొరేట్‌ ఉద్యోగులు వచ్చే జీతంలో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనుకున్నారు. పేద బాలికల చదువుకు అండగా ఉండాలనుకున్నారు. పదేళ్ల క్రితమే ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. 280 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారు. కాదు బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవసరాల్లో ఉన్న బాలికలను వెతుక్కుంటూ వెళ్లి మరీ చేయూతనందిస్తున్నారు సద్గురు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెట్స్‌ ఉద్యోగులు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సంకల్ప పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సమాజ శ్రేయస్సులో తమ వంతు కృషి చేస్తున్నారు.
 
ఒక్కటై కదులుతున్నారిలా….
ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన వీరిలో సేవాభావం పరీక్షించి మరీ కొంత మందిని ప్రతినిధులుగా ఎంచుకున్నారు. మిగతా వారు బయట నుంచి ప్రోత్సాహం అందిస్తుండగా ప్రతినిధులు పలు స్వచ్చంద సంస్థల ద్వారా అవసరాల్లో ఉన్న బాలికలను సంప్రదించి వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసి కార్పొరేట్‌ విద్యను అందించేందుకు చేయూతనందిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌, బ్యాంకింగ్‌ రంగంలో నిష్ఠాతులైన ఉద్యోగులు బాలికలను సంప్రదించి వారితో సమయాన్ని గడుపుతున్నారు. వారి అవసరాలను కనుక్కుంటున్నారు. వారి సమస్యలను తెలుసుకొని సలహాలు ఇస్తున్నారు. చాలా మంది కొలువులు చేసుకుంటూ వీకెండ్‌లో అనుబంధానికి అతుక్కుపోతున్నారు.
 
బాలికలకు భరోసా….
పది సంవత్సరాల క్రితం ఏర్పడిన సంకల్ప మొదటి యేడాది లక్ష రూపాయల విరాళం సేకరించగలిగింది. ముగ్గురు బాలికలకు ఫీజులు చెల్లించింది. ఆ తర్వాత వారు ఎదుగుతున్న తీరును చూసి ఉద్యోగుల్లో తెలియని అనుభూతి ఏర్పడింది. అంతే జీతం రాగానే తోచినంత విరాళం ఓ పెట్టేలో వేసేవారు. సుమారు 150 ఉద్యోగులు నెలకు 500, 1000, 2000 రూపాయలు ఇలా విరాళాలు ఇచ్చారు. దీంతో ట్రస్టులో నిధుల ప్రవాహం పెరిగింది. పది సంవత్సరాల్లో 280 మంది బాలికలకు సహాయం పొందుతున్నారు. ఇందులో 60 మంది ఇప్పటికే పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ఓ విద్యార్థిని మెడిసిన్‌ చదువుతుందని కంపెనీ నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు.
 
వీకెండ్‌లో అవగాహన తరగతులు…
యుక్త వయసు రాగానే కొంత మంది బాలికలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ఉద్యోగులు ప్రతి వీకెండ్‌లో వారికి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటా 6000 మంది విద్యార్థుల్లో మార్పులు తీసుకువస్తున్నారు. చైల్డ్‌ సెక్స్‌ గురించి వివరిస్తున్నారు. బాలికల తల్లిదండ్రుల్లో కూడా పరివర్తన తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
ఫండ్‌ రెయిజింగ్‌ కోసం….
తాము వితరణ చేయడమే కాదు ఇతరుల నుంచి విరాళాలు సేకరించాలని ఉద్యోగులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సంవత్సరం సంకల్ప్‌ ఖాన్‌పాన్‌ దుకాన్‌ పేరిట ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి నిధుల సేకరణ చేస్తున్నారు. సాగర్‌ సొసైటీలోని కార్యాలయంలో సోమవారం కూడా ఇలాంటి ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఇతర కంపెనీ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాలికలకు చేయూతనందించేందుకు ముందుకు వస్తున్నారు.
 
మార్పు కోసమే ఈ ప్రయత్నం
బాలికలు అనగానే గ్రామీణ ప్రాంతాలతో పాటు, బస్తీల్లో చులకన భావం ఉంది. వారు ఎదుగుతుంటే తల్లిదండ్రులు చదివించేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో బాలికలు చదవుకోవాలనే ఉద్దేశంతో సంకల్ప్‌ను స్థాపించాం. ప్రతి నెలా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాం. లైంగిక వేధింపులకు గురి కాకుండా ముందు జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. ఏటా వెయ్యి మంది బాలికలను చదివించాలనేదే లక్ష్యం పెట్టుకున్నాం. దీని కోసం ఇతర సంస్థలతో పనిచేసే ఆలోచన ఉంది.
 
ఫండ్‌ రెయిజింగ్‌ కోసం మరిన్ని కార్యక్రమాలు
ఉద్యోగుల విరాళాలు బాలికల అవసరాలకు తగ్గట్టుగా సరిపోవడం లేదు. అందుకే ఫండ్‌ రెయిజింగ్‌ కోసం మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. గతేడాది సుమారు నాలుగు లక్షల రూపాయలు ఫుడ్‌ ఫెస్టివల్‌ ద్వారా సేకరించాం. ఈ యేడాది నిధులు మరింత రెట్టింపు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే ఇది అమలుకు మరింత సమయం పడుతుంది.