Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జయపుర: ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లింగ వివక్ష ఎదర్కొన్నానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే వెల్లడించారు. మహిళ అయినందున తన సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. జైసల్మేర్‌లో శక్తి సమ్మేళన్‌ పేరుతో మహిళలతో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ముఖ్యమంత్రి అయినందున నాకేమీ సమస్యలు లేవని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ, ఈ పదవిలో ఉండి కూడా మహిళగా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా. నేను మీ సమస్యలను అర్థం చేసుకోగలను. అందుకే మహిళా సాధికారిత కోసం పథకాన్ని రూపొందించాను. దానితో స్త్రీలు ఎవరి ముందూ అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు’ అని రాజే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత కోసం రూపొందించిన రాజశ్రీ పథకం గురించి వివరించారు. ఈ పథకంతో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పలు దశల్లో విడతల వారీగా చదవు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుందని తెలిపారు. ఇంకా ఆమె ప్రవేశపెట్టిన పలు పథకాల ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా మహిళా నేతలు, కార్యకర్తలు, రాజ కుటుంబాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజేకు ఈ కార్యక్రమంలో కత్తిని బహుకరించారు. ఎన్నికల నేపథ్యంలో రాజే తమ రాష్ట్రంలో గౌరవ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా జైసల్మేర్‌ నుంచి రెండో దశ యాత్రను ప్రారంభించారు.