Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉప్పులో సూక్ష్మప్లాస్టిక్‌ రేణువులు

ఐఐటీ–బీ అధ్యయనంలో వెల్లడి

మీ పేస్టులో ఉప్పుందా…అంటూ  ఓ టూత్‌పేస్ట్‌ యాడ్‌లో అడగడం ఇప్పటి వరకు మనం చూశాం. అయితే ఇప్పుడు మీ ఉప్పులో మైక్రోప్లాస్టిక్‌ ఉందా? అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది.  మనదేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల ఉప్పుల్లోనూ ఈ మైక్రో ప్లాస్టిక్‌(సూక్ష్మ ప్లాస్టిక్‌) ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల చేసిన పరిశోధనలో వెల్లడైంది.  ఉప్పును కలుషిత సముద్రపు జలాలతో తయారు చేయడమే దీనికి కారణమని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–బొంబాయి(ఐఐటీ–బి) పేర్కొంది. ఇందులో ఉప్పు తయారు చేస్తున్న కంపెనీల పాత్ర ఏమీ లేదని పేర్కొంది. దేశంలో పేరొందిన  కంపెనీలకు చెందిన ఉప్పు నమూనాలను పరీక్షించగా  626 సూక్ష్మప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు తేలిందని సీఈఎస్‌ఈ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పెద్దలు రోజుకి  ఐదు గ్రాముల వరకు  ఉప్పు తీసుకోవచ్చు. కేజీ సముద్రపు ఉప్పులో 0.063 మిల్లీగ్రాముల మైక్రోప్లాస్టిక్‌ ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఏడాదికి  0.117 మిల్లీగ్రాముల సూక్ష్మప్లాస్టిక్‌ రేణువులు మన కడుపులోకి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.  సీఫుడ్, ఇతర రూపాల్లోకూడా  మైక్రోప్లాస్టిక్‌ మన శరీరంలోకి చేరుతుంది.

ఇలా పరీక్షించారు
ముంబైలోని సూపర్‌మార్కెట్‌లు, స్థానిక కిరాణా దుకాణాల్లో అమ్ముతున్న ఎనిమిది కంపెనీలకు చెందిన మూడేసి చొప్పున ఉప్పు ప్యాకెట్లను సేకరించారు. మొత్తం 24 ఉప్పు ప్యాకెట్లు వివిధ నెలల్లో తయారైనవి, వివిధ బ్యాచ్‌లకు చెందిన వాటిని పరిశోధనకు ఎంచుకున్నారు. ఆరు బ్రాండ్‌లు గుజరాత్‌కు చెందినవి,  మరో రెండు కేరళ, మహారాష్ట్రలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. పరీక్షించిన ఉప్పులో 80 శాతం మైక్రోప్లాస్టిక్‌ రేణువులు రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నాయి.  5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఫైబర్స్‌ను  కూడా గుర్తించారు.

సముద్రాలకు కాలుష్యం ముప్పు
దేశంలోని సముద్రాల్లోకి  ప్రధానంగా నదుల ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలు  చేరుతున్నట్లు గుర్తించామని పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. మైక్రోప్లాస్టిక్‌ ప్రధాన సమస్యగా మారిందన్నారు. సముద్రంలోకి వస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇతర  దేశాల్లోనూ ఇదే సమస్య
ప్రపంచ వ్యాప్తంగా  ఐదు ట్రిలియన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తున్నట్లు  2014లో ఓ సైన్స్‌ జర్నల్‌ ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు కూడా వివిధ దేశాల్లోని సముద్రజలాల్లో మైక్రోప్లాస్టిక్‌ ఉన్నట్లు గుర్తించారు.  చైనా, స్పెయిన్, టర్కీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్‌తో పాటు పలు దేశాల్లోని సముద్రపు ఉప్పుల్లోనూ  మైక్రోప్లాస్టిక్, మైక్రోఫైబర్‌ రేణువులు ఉన్నట్లు తేలింది.  అధిక మొత్తంలో ఉప్పు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండడంతో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. 2017లో 26 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పును ఇండియా ఉత్పత్తి చేసింది. చైనా, అమెరికా  మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి.