Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఇప్పటిదాకా భారత్‌దే పూర్తి ఆధిపత్యం. ఇక ఈ పర్యటనలో మరో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. గత మ్యాచ్‌లో విజయంతో దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై మూడు విజయాలు సాధించిన ఘనతను సొంతం చేసుకున్న భారత్‌.. సిరీస్‌ విజయంతో నయా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే సఫారీ గడ్డపై భారత జట్టు ఇప్పటివరకూ వన్డే సిరీస్‌ను గెలిచిన దాఖలాలు లేవు. దాంతో భారత్‌ ముందు వన్డే సిరీస్‌ను గెలిచేందుకు ఒక సువర్ణావకాశం. శనివారం ఇక్కడ సాయంత్రం గం. 4.30 ని.లకు ఇరు జట్ల మధ్య నాల్గో వన్డే ఆరంభం కానుంది.ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తుండగా, రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని సఫారీలు యోచిస్తున్నారు.

డర్బన్‌లో జరిగిన తొలి  వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇక మూడో వన్డేలో  124 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దాంతో సఫారీ గడ్డపై ఆ జట్టును అత్యధిక పరుగుల తేడాఓ ఓడించిన ఘనతను భారత్‌ సొంతం చేసుకుంది. ఈ మూడు వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కోహ్లి సేన నాల్గో వన్డేలో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.

1992-93లో తొలిసారి సఫారీ పర్యటనకు వెళ్లిన టీమిండియా రెండు విజయాల్ని మాత్రమే సాధించింది. కాగా, 2010-11 సీజన్‌లో ధోని నేతృత్వంలోని భారత్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినా రెండు విజయాలతో సరిపెట్టుకుంది.ఆ పర్యటనలో 2-1తో వన్డే సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా.. సిరీస్‌ను 2-3తో ముగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్‌ను ముందుగానే ఒడిసి పట్టుకుని సఫారీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది కోహ్లి సేన యోచన. అయితే ఇంకా మూడు వన్డేలు మిగిలి ఉండటంతో వాటిలో విజయం సాధించి సిరీస్‌ను సమం​ చేయడానికి దక్షిణాఫ్రికా తమ ప్రణాళికలకు పదును పెడుతోంది. నాల్గో వన్డేలో భారత జట్టు దాదాపు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్‌ చేరడం వారి శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది.

గెలిస్తే.. నంబర్‌ వన్‌ పదిలం

దక్షిణాఫ్రికాతో నాల్గో వన్డేలో భారత జట్టు గెలిస్తే నంబర్‌ వన్‌ ర్యాంకును పదిలంగా ఉంచుకుటుంది. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డే తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత జట్టు.. మూడో వన్డేలో గెలిచి ఆ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే ఈ సిరీస్‌ను భారత జట్టు 4-2తో గెలిచిన పక్షంలోనే అగ్రస్థానం నిలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన పక్షంలో మిగతా రెండు మ్యాచ్‌లతో సంబంధం లేకుండా సిరీస్‌ను నంబర్‌ వన్‌ ర్యాంకుతో ముగిస్తుంది.

జోహన్నెస్‌బర్గ్‌లో రికార్డు యావరేజ్‌

భారత జట్టుకు జోహన్నెస్‌బర్గ్‌ స్టేడియంలో రికార్డు సాధారణంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకూ మొత్తం ఏడు వన్డేలు ఆడిన టీమిండియా.. మూడు గెలిచి, నాలుగు ఓడిపోయింది. 2003 ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఇదే స్టేడియంలో భారత్‌ ఓటమి చవిచూసి కప్‌ను తృటిలో చేజార్చుకుంది.

రోహిత్‌ ఫామ్‌పైనే దృష్టి

దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌లో పలువురు భారత టాపార్డర్‌ ఆటగాళ్లు సత్తాచాటుకుని విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మాత్రం ఫామ్‌ కోసం తంటాలు పడుతున్నాడు. కనీసం క్రీజ్‌లో కుదురుకోవడానికే అపసోపాలు పడుతూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో భారత్‌ గెలిచిన మూడు వన్డేల్లో ఆడిన రోహిత్‌ శర్మ మొత్తం 35 పరుగులు మాత్రమే చేశాడు.  తొలి వన్డేలో 20 పరుగులు చేసిన రోహిత్‌.. రెండో వన్డేలో 15 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో రోహిత్‌ ఫామ్‌పైనే భారత యాజమాన్యం ప్రధానంగా దృష్టి సారించింది. ఆ క్రమంలోనే రోహిత్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తూ గాడిలో పడటానికి యత్నిస్తున్నాడు