Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై తీవ్రంగా కలత చెందిన గంభీర్‌.. ఆవేశంగా ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్‌ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.

అయితే ఈ దాడిని యావత్‌ ప్రపంచం ఖండిస్తోంది. భూగోళంపై ఉగ్రవాదానికి చోటు లేదని, ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సురేశ్‌ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్‌ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.