Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి   నోరు పారేసుకున్నారు. వలసదారులపై  విచక్షణ రహిత వ్యాఖ్యలు చేయడం  తీవ్ర వివాదానికి దారి తీసింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం అతి చెత్త(షిట్‌ హోల్‌)  దేశాలనుంచి  ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డెమెక్రాట్లు,ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ట్రంప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికన్ దేశాలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు  చేశారని బీబీసి రిపోర్ట్‌ చేసింది. వీరికి బదులుగా  నార్వే లాంటి  దేశాల నుంచి వలస వచ్చిన వారిని నియమించుకోవాలని ట్రంప్‌ తన సభ్యులకు సూచించారు. గురువారం ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన మేరీల్యాండ్ డెమోక్రాటిక్ చట్టసభ సభ్యుడు ఎలిజా కమ్మింగ్స్ ట్వీట్ చేశారు. ఇది  క్షమించరాని ప్రకటన అంటూ  తీవ్రంగా ఖండించారు.

ఉటా రిపబ్లికన్,  కాంగ్రెస్‌ లో ఏకైక హైతీ-అమెరికన్ మియా లవ్ ఇవి దుర్మార్గమైన, విభజన, అహంకార పూరిత వ్యాఖ్యలని  మండిపడ్డారు. వెంటనే ట్రంప్ క్షమాపణ  చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మేక్  అమెరికా  గ్రేట్  ఎగైన్‌ అజెండా  నిజంగా మేక్ అమెరికా వైట్ ఎగైన్‌ ఎజెండా అని మరోసారి రుజువైందని  బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్  విమర్శించారు. జాత్యహంకారంతో​   అధ్యక్షుడు ట్రంప్‌ మరింత దిగజారిపోతున్నారని జాతీయ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ కలర్డ్ పీపుల్ ఆరోపించింది.

అటు   వైట్ హౌస్ ట్రంప్‌ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది.  కొంతమంది వాషింగ్టన్‌ రాజకీయవేత్తలు విదేశాల కోసం పోరాటం చేస్తోంటే..అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ప్రజల కోసం పోరాడుతున్నారని  వైట్ హౌస్ ప్రతినిధి రాజ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.