Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌తో పాటు ఆరోగ్యవంతమైన ప్రశాంత జీవనం మీ సొంతం కావాలంటే.. ఉరుకుల పరుగుల జీవితానికి ఒక్క క్షణం స్వస్తి చెప్పి మీ జీవిత గమనాన్ని గమనించుకోండి. చాలా మంది ఆఫీసు సమయం అయిపోయాక కూడా పని చేస్తుంటారు. మరికొంత మంది సెలవుల్లో ఇంటి దగ్గరున్నా ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లతో పనిచేస్తుంటారు. ఆఫీసు పని, వ్యక్తిగత జీవితం రెంటి మధ్య సమతూకం లేకపోతే ఆరోగ్యం, కెరీర్‌ రెండూ దెబ్బతింటాయని అధ్యయనాలు చెపుతున్నాయి.
అతి ముఖ్యమైన పని అన్నింటికన్నా ముందు!
 మీరు చేయాల్సిన పనులలోంచి అతి ముఖ్యమైన వాటిని ఎంచుకోండి. వాటిని ఒకటి, రెండు, మూడు… ఇలా వరుస క్రమంలో చేసుకుంటూ పోండి. మీ మనసు వేటిని ముఖ్యమైన పనులుగా భావిస్తుందో వాటికే ప్రాధాన్యం ఇవ్వండి.
వృథా చేసిన కాలం అదృష్టాన్ని తారుమారు చేస్తుంది!
 తొలుత మీ రోజువారీ జీవితంలో ఎక్కడ సమయం వృథా అవుతోందో గుర్తించండి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి.. ప్రణాళిక వేసుకోండి.
ఒక్కసారి ఒక్క పనే!
 ఏకకాలంలో రెండు మూడు పనులు చక్కబెట్టాలని చూడొద్దు. దానివల్ల మీరు బిజీ కావటమే తప్ప మంచి ఫలితాలు రావు. పనిలో నాణ్యత దెబ్బతింటుంది.
ఇది మీ సమయం!
 ఎప్పుడూ పీకల్లోతు పనుల్లో మునిగిపోవద్దు. జీవితంలో మీకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోండి. ఎంత అత్యవసర పరిస్థితులున్నా.. ఆ సమయం మీ ఆనందం కోసమేనని గుర్తించండి. అదేపనిగా తలకుమించిన పని మీదేసుకోవద్దు.
జాలీడేస్‌!
చిన్నప్పుడు స్కూలుకు దసరా, సంక్రాతి సెలవులిచ్చినట్టే.. మీ ఆఫీసు పనికి మీరే సెలవివ్వండి. బ్యాగూ, సూట్‌కేస్‌లు సర్దుకొని ఎంచక్కా నచ్చిన ప్రదేశానికి చెక్కేయండి. ఏడాదిలో కనీసం మూడువారాల పాటు ఇలా చేస్తే… లైఫ్‌ బ్యాటరీ రీచార్జ్‌ అవుతుంది. తిరిగొచ్చాక ఆఫీసు పనిని మరింత చక్కగా చేయగలుగుతారు.
మార్గదర్శకులుండాలి!
అవసరమనుకుంటే మీకంటూ ఒక మెంటార్‌ను ఏర్పాటు చేసుకోండి. పనిని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయటానికి వారి అనుభవం మీకు అక్కరకొస్తుంది.
టవ్యాయామాన్ని వదలొద్దు!
రోజుకో గంట వ్యాయామాలకు కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన మనస్సుతో పనిచేయటం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది.
 
హద్దులు ఏర్పరుచుకోండి!
మీ కుటుంబ సభ్యులతో రోజూ కొంత సేపు గడపండి. సమయంలో పూర్తిగా వారితో మమేకమవ్వండి. ఆ సమయంలో మరే పని గురించి ఆలోచించొద్దు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయండి.