Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వివాదాలు తప్ప జీవితాలకు విలువ లేకుండా పోయింది ఈ సమాజంలో. పీకే-ఎంకేల ఎపిసోడ్‌ ఇంతగా వైరల్‌ అవ్వడానికి ఏముంది అందులో? కాళ్లు లేకపోయినా ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నా. నాలాంటి ఎంతో మంది జీవితాల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నా. అలాంటి వారి కోసమే ఈవెంట్లు చేస్తున్నా. నా ప్రయత్నాలకు ‘మాట సాయం చేయండి చాలంటే’ స్పందించిన వారు లేరు. ఇది హృదయం లేని సమాజం. ఇలాంటి మనుషుల మధ్య బతికి ప్రయోజనం లేదనిపించి ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగింది. అందుకే ఆ పోస్టు పెట్టాను.
నేనేంటో నిరూపించుకున్నా…
మాది అనంతపూర్‌. 2011లో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పీజీ డిప్లమో చేశాను. పీజీ అయిపోయిన తరువాత కొంత కాలం టీవీ చానళ్లలో న్యూస్‌ ప్రెజెంటర్‌గా, ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా చేశాను. వీల్‌చైర్‌లోనే తిరుగుతూ రోజుకు పది గంటలు పనిచేశాను. వైకల్యం శరీరానికే కాని… ప్రతిభకు కాదని చూపించాను. 2013లో జరిగిన తొలి ‘మిస్‌ వీల్‌చైర్‌ ఇండియా’ అందాల పోటీలకు నాటి ఉమ్మడి ఏపీ నుంచి ఎంపికయ్యా. అందులో నాకు ‘మోస్ట్‌ వోటెడ్‌ గర్ల్‌’ టైటిల్‌ వచ్చింది. కానీ… స్పాన్సర్లు లేరని నిర్వాహకులు నన్ను ఫైనల్స్‌కు ఆహ్వానించలేదు.
 
వారికీ ఒక వేదిక…
ప్రస్తుతం ‘వీవ్‌ మీడియాస్‌’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తున్నా. తొలిసారిగా దివ్యాంగ అమ్మాయిలతో ‘మిస్‌ ఎబిలిటీ’ అందాల పోటీలు నిర్వహించాలని నిర్ణయించాను. మార్చి 10న నగరంలో ఈవెంట్‌. రూ.50 లక్షలు ఖర్చవుతుంది. వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి, దాన్ని బయటకు తీసే ప్రయత్నం ఇది. ఇందులో గాయకులు, డ్యాన్సర్లు, పెయింటర్ల వంటి విభిన్న కళల్లో ప్రావీణ్యమున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు శ్రీలేఖ (హైదరాబాద్‌). ఆమెకు శరీరంలో తల తప్ప ఏ అవయమూ పనిచేయదు. కానీ… తను నోటితో కుంచె పట్టి అద్భుతంగా పెయింటింగ్స్‌ వేయగలదు. ‘ఇంటర్నేషనల్‌ మౌత్‌ పెయింట్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’లో సభ్యత్వం ఉన్న ఇద్దరు ముగ్గురు భారతీయ మహిళల్లో తనూ ఒకరు. ఇలాంటి టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చి, వారికి ప్రావీణ్యం ఉన్న రంగంలో అవకాశాలు కల్పించాలన్నదే ఈవెంట్‌ లక్ష్యం. ఫేస్‌బుక్‌లో ఇలాంటి వాటి గురించి పోస్ట్‌ చేస్తే భుజం తట్టడం మాట అటుంచి, కనీసం స్పందించే వారే లేకపోవడం బాధ కలిగిస్తోంది.
 
ఏ సెలబ్రిటీ తలుపు తట్టినా తిరస్కారమే!
నేను చేయబోయే ఈవెంట్‌ను స్పాన్సర్‌ చేయమని అడిగితే… ‘సెలబ్రిటీలు ఎంతమంది వస్తున్నారు’ అని అడుగుతున్నారు. సెలబ్రిటీల దగ్గరికి వెళితే ‘ఎంతిస్తారు’ అంటూ మధ్యవర్తులు అడుగుతున్నారు. అసలు సెలబ్రిటీలనే కలవనివ్వడం లేదు. సాయం కోసం గత నెలలో పవన్‌కల్యాణ్‌ ఇంటికి వెళితే… గేటు బయటే ఆపేశారు. హైదరాబాద్‌లో నేను ప్రయత్నించని సెలబ్రిటీ లేరంటే నమ్ముతారా? ఫైనాన్షియల్‌గా వాళ్లను తృప్తి పరిస్తేనే అవకాశం ఇస్తారు. మీడియాలో అనవసర విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యం మాలాంటి వారికి ఎందుకు ఇవ్వరు? తెలంగాణలో 40 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఏపీలోనూ ఇంచూమించు అదే సంఖ్యలో ఉంటారు. అనవసర రాద్ధాంతాలపై ఎనలేని ఆసక్తి చూపినవారు నా ప్రయత్నాన్ని ఒక చిన్న మాటతో ఎందుకు ప్రోత్సహించరు? ఇలాంటివన్నీ చూసినప్పుడే నాకు నిజంగా చచ్చిపోవాలనిపించింది. నేను కోరేదొక్కటే… మాలో అవయవ లోపాలను కాకుండా ప్రతిభను చూడమని. మాపై జాలి చూపవద్దు… నిజమైన అవకాశాలిచ్చి ప్రోత్సహించమని!