Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు తాజాగా మరో సవాలు ఎదురైంది. తమకు ఇవ్వాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించకపోతే.. విమానాలు నడపబోమని ఎయిరిండియా పైలట్లు బెదిరింపులకు దిగారు. వేతనం, ఇతర అలోవెన్స్‌ల విషయంలో మిగతా సిబ్బందితో పోలిస్తే పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది పట్ల ఎయిరిండియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇతర సిబ్బందికి ఆలస్యమైనా పూర్తి చెల్లింపులు చేస్తున్నారని.. పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందికి మాత్రం ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లను నిలిపివేస్తున్నారన్నారు.

‘ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లు వెంటనే చెల్లించకపోతే మేం విధులు నిర్వర్తించబోం. విమానాలు నడపం’ అని ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌(ఐసీపీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అసోసియేషన్‌లో 700 మంది పైలట్లు సభ్యులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లను రెండు నెలల తర్వాత చెల్లిస్తారు. అంటే జూన్‌ నెలకు సంబంధించిన అలోవెన్స్‌లను ఆగస్టు 1న చెల్లించాలి. అయితే ఇంతరవకు తమకు జూన్‌ అలోవెన్స్‌లు ఇవ్వలేదని పైలట్లు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై ఎయిరిండియా నుంచి సానుకూల స్పందన రాకపోతే తాము ఫ్లయింగ్‌ విధులు చేపట్టబోమని పైలట్లు హెచ్చరించారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అందుకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు.

వేల కోట్ల రూపాయాల అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రయివేటీకరణ బాట పట్టింది. ఎయిరిండియాలో మెజార్టీ వాటాను అమ్మేయాలని నిర్ణయించింది. అయితే ఈ వాటాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రయివేటీకరణ ఆలోచనను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టింది.