Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మహనీయుల విగ్రహాల కూల్చివేతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించినప్పటికీ దేశంలోని పలుచోట్ల అల్లరి మూకలు శాంతించలేదు. త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేసింది మొదలు గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన సంగతి తెలసిందే. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ, ద్రవిడ ఉద్యమనేత ‘పెరియార్’ రామస్వామి సహా డాక్టర్. బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తాజాగా ఇవాళ ఉదయం కేరళలో మహాత్ముడి విగ్రహాన్ని సైతం కూల్చివేయడంతో మరింత కలకలం రేగింది.
ఉదయం 7 గంటల సమయంలో కాన్నూర్ జిల్లా తలిపరాంబ తాలూకా కార్యాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మహాత్ముడి విగ్రహంపై రాళ్లతో దాడిచేయడంతో పాటు కళ్లజోడు, పూలదండలను దుండగులు ధ్వంసం చేశారు. మరోవైపు చెన్నైలోని తిరువట్టియూర్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై ఎర్రరంగు పోశారు. విగ్రహాలు ధ్వంసంచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.