Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హరిహర సుతుడు అయ్యప్ప. పద్దెనిమిది కొండల మధ్యలోని శబరిగిరి శిఖరంపై చిన్ముద్రధారిగా కొలువైన ఆ స్వామి దర్శనం కోసం భక్తులు దీక్ష చేపడతారు. మండలం రోజులు కఠిన నియమాలను ఆచరించి యాత్రకు బయలుదేరుతారు. కేరళలోని కొండలు, దట్టమైన అడవుల గుండా ప్రకృతి మధ్య సాగే ఈ యాత్ర ఓ కఠినమైన సాహసం! చిరస్మరణీయమైన అనుభవం!!

అపారమైన భక్తి శ్రద్ధలతో చేపట్టే అయ్యప్ప దీక్ష ఒక ఎత్తయితే, దీక్ష ముగించడానికి చేసే యాత్ర మరో ఎత్తు. ముఖ్యంగా ఎరుమేలి నుంచి అయ్యప్ప సన్నిధానం వరకూ సాగించే ప్రయాణం ఎంతో శ్రమతో కూడుకున్నది. దీన్ని ‘పెద్దపాదం’ అంటారు. వందల ఏళ్ళుగా అయ్యప్ప దీక్షాపరులు సాగిస్తున్న పెద్దపాదం యాత్రా మార్గం ప్రకృతి సౌందర్యంతో అలరారాదే కాకుండా సాహసోపేతమైనది కూడా!

అయ్యప్పను కొలిచిన భక్తులు ఇరుముడి ధరించి శబరి యాత్రకు బయలుదేరతారు. ముందుగా స్వాములు ఎరుమేలి చేరతారు. ఇక్కడ రాజశేఖర మహారాజా నిర్మించిన ధర్మశాస్తా, పేటశాస్తా ఆలయాలు, స్వామి అనుచరుడు వావర్‌ మసీదు ఉన్నాయి. గిరిజన సంప్రదాయం ప్రకారం స్వాములు రంగులు వేసుకుని, మేళతాళాలు వెంటరాగా… పేటతుళ్లై ఆడతారు. తమ మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకొనే క్రమంలో చేసే నాట్యమిది. అనంతరం ధర్మశాస్తా, వావర్‌ స్వాములకు ప్రణమిల్లుతారు. ఇక్కడి నుంచి శబరి యాత్ర రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ‘పెద్ద పాదం’… రెండోది ‘చిన్న పాదం’. పెద్ద పాదం అంటే ఎరుమేలి నుంచి శబరిమల వరకు సాగే పాదయాత్ర. ఇది దాదాపు 74 కిలోమీటర్లు ఉంటుంది. ఎరుమేలిని ‘శబరిమల ప్రవేశ ద్వారం’ అని కూడా చెప్పవచ్చు. ‘చిన్నపాదం’… అంటే పంబ నుంచి శబరి గిరి వరకు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అయితే వికలాంగులు, వృద్ధులకు పంబ నుంచి డోలీ సౌకర్యం ఉంటుంది. నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సేవలు ఎవరైనా పొందవచ్చు.

పెద్ద పాదం…
దట్టమైన అటవీ ప్రాంతం గుండా ఈ యాత్ర సాగుతుంది. ఏటా డిసెంబర్‌ 30 నుంచి మకర జ్యోతి (మకర సంక్రాంతి) వరకు మాత్రమే ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు. మధ్యలో ఎత్తయిన కొండలు ఎక్కుతూ, రాళ్లు, రప్పలున్న సన్నని కాలి బాటలో నడవాల్సి ఉంటుంది. పులులు, ఏనుగుల వంటి వన్యప్రాణులు సంచరించే ప్రదేశం అది. మెడలో తులసి మాల… శిరస్సున ఇరుముడి… నుదుట గంధం, కుంకుమ, విబూది బొట్టు… భగవంతుడే భక్తుడై కీకారణ్యంలో కాలికి చెప్పులు కూడా లేకుండా నడక సాగుతుంది. అయ్యప్ప శరణు ఘోషతో భక్తులు ముందుకు సాగుతారు. దట్టమైన అడవిలో అదే వారికి రక్ష. ఈ ప్రాంతమంతా మణికంఠుడు తిరుగాడిన నేల. పులి పాల కోసం ఇరుముడి ధరించి, మహిషిని సంహరించిన అయ్యప్ప ఈ మార్గం ద్వారానే శబరి గిరికి చేరినట్టు పురాణాలు చెబుతున్నాయి.

కాళైకట్టి: ఎరుమేలిలో బయలుదేరిన భక్తులు ముందుగా పెరూర్‌తోడు వస్తారు. పులి పాల కోసం వచ్చిన స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత కోటైపాడి దాటి కాళైకట్టి వస్తారు. మహిషిని సంహరించి, దాని శరీరంపై స్వామి నర్తించిన చోటిది. అయ్యప్ప నాట్యం చూడటానికి వచ్చిన శివుడు, తన నందిని ఇక్కడే కట్టేశాడట. అందుకే దీనికి ‘కాళైకట్టి’ అని పేరు. ఈ ప్రాంతంలో శివాలయంతో పాటు స్వామి ఉపయోగించిన ఆయుధాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.. కేరళ అటవీ శాఖ వారు ఇక్కడ భక్తుల వివరాలు సేకరిస్తున్నారు. తప్పనిసరిగా ప్రతిఒక్కరూ ఐడీ కార్డు చూపించి, టోకెన్‌ పొందాల్సి ఉంటుంది. దాన్ని పంబ సమీపంలోని చెక్‌పోస్ట్‌ వద్ద తిరిగి తీసుకుంటారు. ఈ విధానం ఈ సంవత్సరమే ప్రవేశపెట్టారు.

అళుదా నది: కాళైకట్టి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అళుదా నది వస్తుంది. మహిషి కార్చిన కన్నీరే ఇలా నదిలా పారుతుందనేది ఓ గాథ. ఈ పుణ్య నదీ పరివాహకాలన్నీ పచ్చగా నయన మనోహరంగా ఉంటాయి. అలసిన స్వామి భక్తులు నదిలో స్నానమాచరించి, విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి ప్రయాణం ప్రారంభించే ముందు నదిలో చిన్న రాయిని తీసుకుని ముందుకు సాగుతారు.

అళుదామేడు: అళుదా నది దాటగానే ప్రారంభమయ్యే కొండను అళుదామేడు అంటారు. ఈ కొండ ఎత్తుగా ఉండటం వల్ల ఎక్కడం కష్టంగా ఉంటుంది. అయితే దీక్షలో పాటించిన కఠోర నియమాలు ఇక్కడ స్వాములకు ఉపయోగపడతాయి. కొండలు నిదానంగా ఎక్కాలి. ఐదు నిమిషాలకు ఒకసారి విరామం ఇస్తూ ముందుకు వెళ్లాలి.

కళ్లిడుంకుండ్రుం: మహిషిని అయ్యప్ప వధించి, విసిరేస్తే దాని శరీరం ఇక్కడ పడిందట. దేవతలు తలో రాయి వేసి ఆ కళేబరాన్ని పూడ్చారని చెబుతారు. అందుకే భక్తులు అళుదా నది నుంచి తెచ్చిన రాయిని కళ్లిడుంకుండ్రుంలో వేసి, ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంజిప్పార, ఉడుంబారై కొట్టాయ్‌: ఇక్కడ కోటైశాస్తా గుడి ఉంది. ఉదయన్‌ అనే బందిపోటు దొంగ స్థావరం ఇక్కడేనని చెబుతారు. శబరీశుడి పరివారం ఇక్కడే సంచరిస్తారని భక్తుల నమ్మకం.

కరిమల: అళుదామేడు దిగిన స్వాములు ముక్కొళి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, కరిమలతోడుకు వస్తారు. రెండు కొండల మధ్యనున్న నీటి ప్రవాహాన్ని దాటి కరిమల ఎక్కడం ప్రారంభిస్తారు. పాదయాత్రలో అత్యంత కఠినమైనది కరిమల. ఇది ఎక్కడం ఎంత కఠినమో దిగటం కూడా అంతే కష్టం. సన్నని కాలిబాట… ఓ పక్క ఎత్తయిన చెట్లు… మరోవైపు లోయలు… అడుగు తడబడకుండా ముందుకు సాగాలి. ఇది ఏనుగుల ఆలవాలం. కొంత దూరం కొండ ఎక్కాక కరిమల భగవతి దర్శనమిస్తుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి స్వాములు యాత్ర కొనసాగిస్తారు. అనంతరం కరిమల శిఖరం చేరి, అక్కడి దేవికి మొక్కుతారు. అలసిన భక్తులు ఇక్కడ కొంత సేమ విశ్రాంతి తీసుకుని, కొండ దిగుతారు. అత్యవసర సేవలు అందించడానికి తొలిసారిగా ఈ మార్గంలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పెరియానవట్టమ్‌: కరిమల దిగి కొంత దూరం వస్తే స్వాములు పెరియానవట్టమ్‌ (పెద్ద ఏనుగు పాదం) చేరతారు. ఇక్కడ కూడా ఏనుగులు అధిక సంఖ్యలో సంచరిస్తుంటాయి. ఆ తరువాత చెరియానవట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) దాటి, పంబా నదికి వస్తారు.

పంబా నది: గంగ అంత పవిత్రమైనది పంబా నది. రాముడి కోసం శబరి వేచి ఉన్నది ఇక్కడేననీ, శ్రీరాముడిని హనుమంతుడు మొదట కలుసుకున్నదీ ఇక్కడేనని పురాణ గాథలు చెబుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలతో పంబ చేరిన భక్తులు, ఆ పవిత్ర నదిలో స్నానం చేస్తారు. చిన్నపాదం చేసేవారి నడక ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక ఇక్కడి నుంచి సన్నిధానం వైపు యాత్ర సాగుతుంది.

పంబా గణపతి: పుణ్య తీర్థంలో మునిగి పవిత్రులైన స్వాములు ముందుగా పంబా గణపతిని దర్శించుకుంటారు. అక్కడ టెంకాయ కొట్టి, రాముడు, పార్వతి, హనుమంతుడు ఆలయాల్లో మూర్తులను దర్శించుకుంటారు. దర్శనం కోసం ఆన్‌లైన్‌లో క్యూ బుకింగ్‌ చేసుకున్న స్వాములు ఇక్కడే తమ టోకెన్‌ను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది దూరం వెళ్లగానే అయ్యప్ప దేవాలయం కట్టించిన పందళరాజు ఉంటాడు. అక్కడ కానుకలిచ్చి, ప్రసాదం తీసుకుని, ప్రయాణానికి అనుమతి కోరడం ఆనవాయితీ.

నీలిమల: అళుద, కరిమల తరువాత అంత కఠినంగా ఉండేది నీలిమల. ఈ కొండ ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి ఎడమ పక్క ఉన్న లోయను అప్పాచి కుళి అని, కుడి వైపునున్న తగ్గు ప్రాంతాన్ని ఇప్పాచి కుళి అని పిలుస్తారు. స్వామి గణాలు ఇక్కడ నివసిస్తాయంటారు. ఈ కొండ శిఖర భాగమే అప్పాచిమేడు.

శబరి పీఠం: అప్పాచిమేడుతో కొండ ఎక్కడం ముగుస్తుంది. కొంచెం ముందుకు వెళితే శబరి పీఠం వస్తుంది. రాముడు శబరిని కలిసిన చోటు ఇది. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్‌ చేసుకున్నవారిని ఇక్కడి నుంచే సన్నిధానానికి అనుమతిస్తారు. బుకింగ్‌ చేసుకోని స్వాములు శరంగుత్తి మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి ఉంటుంది. ధర్మశాస్తా, ఆయన పరివారం ఇక్కడ ఉన్న మర్రిచెట్టుకు బాణాలు గుచ్చినట్టు చెబుతారు. అందుకే కన్నెస్వాములు ఎరుమేలిలో చేతపట్టిన బాణాలను తమ రాకకు గుర్తుగా, ఇక్కడ గుచ్చుతారు.

పదునెట్టాంబడి: శబరి పీఠం తరువాత మరక్కూటమ్‌ మీదుగా స్వాములు అయ్యప్ప సన్నిధిలోని పదునెట్టాంబడి చేరుతారు. చూడటం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం, ఢాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి 18 తత్త్వాల ఆధీనుడై స్వామి ఉన్నాడని తెలియజెప్పడమే అష్టాదశ సోపానాల పరమార్థం. అందుకే ఆ సోపానాలకు కొబ్బరికాయ కొడతారు. వాటికి ప్రణమిల్లి, అధిరోహిస్తారు. యోగముద్రలో ఉన్న స్వామిని దర్శించుకుని తరిస్తారు.

పద్ధెనిమిది కొండలు
అయ్యప్ప చరిత్రలో పద్ధెనిమిదికి ఎంతో విశిష్టత ఉంది. అయ్యప్ప పద్ధెనిమిది కొండల మధ్యలో కొలువై ఉన్నాడు. పద్ధెనిమిది మెట్లు పద్ధెనిమిది తత్త్వాలకు, దేవతలకు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ఇంజిప్పారమల, కాళైకట్టి, పుదుచ్చేరి, కరిమల, తలైప్పారామల, దేవర్‌మల, శ్రీపాదమల, మైలాడుంమల, మాతంగమల, కాలిక్కిమల, చిత్తంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నీలక్కల్‌మల, పొన్నాంబలమల, శబరిమల వంటి 18 కొండలను పద్ధెనిమిది మంది దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు.

ఇవి గుర్తుంచుకోండి
శబరిమల పరిసరాలను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. ముఖ్యంగా అడవులు వాటర్‌ బాటిళ్లు, పాలిథిన్‌ కవర్లు, షాంపూ ప్యాకెట్లతో ముంచెత్తుతున్నాయి. ఇవి వన్యప్రాణులకు ప్రాణాంతకంగా మారాయి. అందుకే అడవిలోకి ప్రవేశించే ముందు బ్యాగ్‌లను పరిశీలిస్తున్నారు. ప్లాస్టిక్‌ మంచి నీటి బాటిల్స్‌ను అనుమతించడం లేదు. శబరి కొండపైనా ఇదే పరిస్థితి. పెద్ద పాదంలో విశ్రాంతి తీసుకోవడానికి, తినడానికి విరివిగా విరులు (షెల్టర్లు) అందుబాటులో ఉన్నాయి. అక్కడ మంచినీళ్లు ఉచితంగా ఇస్తారు. ఎక్కడా వాటర్‌ బాటిల్స్‌ విక్రయించడం లేదు. కనుక అరణ్య మార్గంలో నడిచేవారు దాహార్తిని తీర్చుకొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం శ్రేయస్కరం. విడిచిన దుస్తులను పంబా నదిలో వదిలేయడం కూడా నిషేధం.