Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దిల్లీ : కేరళలో వరదలు సృష్టించిన బీభత్స పరిస్థితులను తట్టుకుని పోరాడి ఎంతోమంది ప్రజల ప్రాణాలను రక్షించిన మత్స్యకారులను పోలీస్‌శాఖలోకి తీసుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 200మంది మత్స్యకారులను పోలీస్‌శాఖలో కోస్టల్‌ వార్డెన్స్‌గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి డా.థామస్‌ ఐసాక్‌ ప్రకటించారు. వారు ‘అత్యుత్తమ రక్షకులు’ అని కితాబిచ్చిన ఆయన మత్స్యశాఖతో కలిసి ప్రతిజిల్లాలో ఓ రెస్క్యూ టీంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరదల్లో మత్స్యకారులు చేసిన సహాయాన్ని గుర్తించి వారిని ‘రాష్ట్ర ప్రతేక నావికా దళం’, ‘తీరప్రాంత యోధులు’ అంటూ అక్కడి ప్రజలు కీర్తిస్తున్నారని ఆయన చెప్పారు. విపత్తు ముంచెత్తుతోందని తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా పలువురు మత్స్యకారులు సొంతంగా ఖర్చులు భరించి పడవలను తీసుకొచ్చారని చెప్పారు. ఆ సహకారం వల్లనే 65,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగామని చెప్పారు. పోలీస్‌శాఖలో వారికి ఉద్యోగాలను కల్పించేందుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.

గత బుధవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారులను సత్కరించి వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. తమ, కుటుంబాల భద్రత గురించి కానీ, ప్రభుత్వం నుంచి ప్రతిఫలాన్ని ఆశించి కానీ మత్స్యకారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనలేదని అన్నారు. ఇలాంటి ఐకమత్యాన్ని రక్షించుకుంటూ మన ప్రియమైన రాష్ట్రం కోసం ముందుకెళదామని ఆయన పిలుపునిచ్చారు. కేరళ యావత్తు ప్రజల తరఫు నుంచి వారికి బిగ్‌ సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం కేరళ వరదల్లో మత్స్యకారులు చేసినటువంటి సహాయాన్ని ప్రశంసించారు.