Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వివాదాస్పద పైగా భూముల విషయంపై ప్రభుత్వం పైచేయి సాధించింది. దశాబ్దాలుగా పీటముడి పడిన భూములపై చిక్కుముడి వీడింది. హైకోర్టు తాజా తీర్పుతో రూ.1500 కోట్లకుపైగా విలువైన భూములకు సంబంధించి భారీ ఉపశమనం లభించింది. సీఎ్‌స-7లో భాగమైన కొంత భూమికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. సీఎస్‌-7 భూములపై నమోదైన కేసులన్నీ మోసపూరితమేనని చేసిన వ్యాఖ్య ఈ భూముల వ్యవహారాన్నే మార్చేసింది. దాంతో, వివాదాల్లో ఉన్న దాదాపు 135 ఎకరాల అత్యంత విలువైన భూములు ప్రభుత్వపరం కానున్నాయి. హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘పైగా’ భూములు అనేకం ఉన్నాయి. వీటికి సంబంధించి 1954 నుంచీ కోర్టుల్లో వివాదాలు నడుస్తు న్నాయి. హైదరాబాద్‌ చుట్టు పక్కల వందల ఎకరాల భూములకు తాము వారసులమంటూ అప్పట్లోనే కొందరు విడతలవారీగా కోర్టుకెక్కా రు.
పెద్దఎత్తున కేసులు నమోదు కావడం.. వాటి విచారణలో ఇబ్బందు లు రావడంతో వాటన్నింటినీ క్లయింట్ల వారీగా విడదీసి ప్రత్యేక కేసులుగా నమోదు చేశారు. సీఎస్‌ (సివిల్‌ సూట్‌)-1, సీఎస్‌-2, సీఎస్‌-3 అంటూ విభజించారు. వీటిలో కొన్ని కేసులు సుప్రీం కోర్టుకూ చేరాయి. వీటిలో సీఎస్‌-7, సీఎస్‌-14 కీలకమైనవి. ఈ భూములపై తాము కూడా హక్కు దారులమంటూ ప్రభుత్వం కూడా వాదిస్తోంది. సీఎ్‌స-7కి సంబంధించి 358 ఎకరాలకుపైగా భూములపై వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబరు 46లో 84.3 ఎకరాలతోపాటు బాలానగర్‌ మండలం షంషీగూడ సర్వే నంబరు 57లో 274 ఎకరాల భూములున్నాయి. వీటిపై హక్కులు తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులతో పాటు ప్రభుత్వం కూడా వాదిస్తోంది. దశాబ్దాలుగా ఈ కేసులు తేలడం లేదు.
కాగా, రాయదుర్గం సర్వే నంబరు 46లో భూమికి తాము హక్కుదారులమని, తమకు అనుకూలంగా గతంలో కోర్టు డిక్రీ ఇచ్చిందని, దాని ఆధారంగా ఆ భూములను తమకు మ్యుటేషన్‌ చేయాలని కోరుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. తహసీల్దార్‌పై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలని కోరారు. దీనిని గతంలో విచారించిన సింగిల్‌ బెంచ్‌ తహసీల్దార్‌కు 2 నెలల జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధించింది. దీనిపై తహసీల్దార్‌ తిరుపతిరావు డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేశారు. 4 రోజుల కిందట డివిజన్‌ బెంచ్‌ తహసీల్దార్‌పై ఉన్న కోర్టు ధిక్కారం కేసును కొట్టివేసింది. ప్రభుత్వ, ప్రజాహితాన్ని కాపాడడం ఆయన కర్తవ్యమని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే, సీఎస్‌-7 కేసులన్నీ మోసపూరితమని వ్యాఖ్యానించింది. కాగా, ఈ భూముల విషయంలో ప్రభుత్వానికి ఉపశమనం లభించనుంది.