Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

  • పేటీఎంలో బెర్క్‌షైర్‌కు స్వల్ప వాటా
  • కంపెనీ మార్కెట్‌ విలువ రూ.70,000 కోట్లు!
‘ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగ సేవలను పునరావిష్కరించేందుకు చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి’
– వారెన్‌ బఫెట్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌
న్యూఢిల్లీ: మార్కెట్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే.. దేశంలో అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎంలో వాటా కొనుగోలు చేసింది. బఫెట్‌కు భారత్‌లో ఇది తొలి పెట్టుబడి. ఇప్పటివరకు టెక్నాలజీ రంగ పెట్టుబడులకు దూరంగా ఉన్న బఫెట్‌.. పేటీఎం లాంటి టెక్‌ స్టార్టప్ లో వాటా కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో పేటీఎం బోర్డులో బెర్క్‌షైర్‌ ఇన్వెస్ట్ మెంట్‌ మేనేజర్‌ టాడ్‌ కోంబ్స్‌ స్థానం కల్పిస్తారు. ఈ ఒప్పందం లో భాగంగా కొనుగోలు చేసిన వాటా, పెట్టుబడులకు సంబంధించిన విషయాలను మాత్రం ఇరు వర్గాలు వెల్లడించలేదు.
పేటీఎం బ్రాండ్‌ పేరుతో డిజిటల్‌ చెల్లింపు సేవలందిస్తోన్న వన్‌97 కమ్యూనికేషన్స్‌లో బెర్క్‌షైర్‌ 30- 35 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,000-2,500 కోట్లు) పెట్టుబడులు పెట్టడం ద్వారా 3-4 శాతం వాటా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పేటీఎంలో పెట్టుబడులు కలిగిన అంతర్జాతీయ సంస్థలు ఆలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌ సరసన తాజాగా బఫెట్‌ సంస్థ కూడా చేరింది. జపాన్‌కు చెందిన టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్‌ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్‌ గత ఏడాది పేటీఎంలో 20 శాతం వాటాను 140 కోట్ల డాలర్ల (దాదాపు రూ.9 వేల కోట్లు)కు కొనుగోలు చేసింది. ఆలీబాబా, ఆంట్‌ ఫైనాన్షియల్‌ కూడా కీలక వాటాదారులుగా ఉన్నాయి.
అత్యంత విలువైన స్టార్టప్‌గా పేటీఎం
ఈ వాటా కొనుగోలు ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటే పేటీఎం మార్కెట్‌ విలువను 1,000-1,200 కోట్ల డాలర్లు (దాదాపు రూ.70,000-84,000 కోట్లు) అవుతుందని మార్కెట్‌ వర్గాల విశ్లేషణ. దాంతో దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ గా పేటీఎం అవతరించింది. దేశీయ డిజిటల్‌ చెల్లింపు సేవల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎంకు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, గూగుల్‌ తేజ్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. త్వరలో వాట్సప్‌ కూడా ఈ విభాగ సేవల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల పోటీ నుంచి తట్టుకుని తన అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు పేటీఎంకు తాజా పెట్టుబడులు చాలా కీలకం కానున్నాయి.
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో వన్‌97 కమ్యూనికేషన్స్‌కు 49 శాతం వాటా ఉంది. పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర్‌ శర్మ పేటీఎం మాల్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కు పోటీగా ఇ-కామర్స్‌ సేవలందిస్తున్నారు.
అంత మోజెందుకు?
దేశంలో డిజిటల్‌ చెల్లింపు సేవల భవిష్యత్‌ ముఖచిత్రం అత్యంత ఆశాజనకంగా ఉండటమే బఫెట్‌ పెట్టు బడులకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 20,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత డిజిటల్‌ చెల్లింపుల రంగం 2023 నాటికి ఐదు రెట్లు పెరిగి లక్ష కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. డిజిటల్‌ చెల్లింపు సేవల రంగంలో పేటీఎం అతిపెద్ద, అత్యధిక మంది వినియోగదారులున్న కంపెనీ. అంతేకాదు, పేటీఎం గ్రూప్‌ పేమెంట్స్‌ బ్యాంకింగ్‌, ఇ-కామర్స్‌ సేవల్లోకి సైతం ప్రవేశించింది.
కీలక సేవల్లో అగ్రగామిగా ఉండటంతో పాటు ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంతో గ్రూప్‌ అభివృద్ధిపై పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్‌, ఆలీబాబా, ఆంట్‌ ఫైనాన్షియల్‌, ఎస్‌ఎఐఎఫ్‌ పార్ట్‌నర్స్‌, మీడియాటెక్‌తో పాటు టాటా గ్రూప్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా కూడా వ్యక్తిగత హోదాలో పేటీఎంలో పెట్టుబడులు పెట్టారు.