Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సిద్ధపురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొందిన సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్ద ఉన్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. అలాగే సిద్ధపురుషులు కూడా తమ సంకల్పాలను, సిద్ధులను లోక కళ్యాణం కోసం, లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే వినియోగిస్తారు. శంకర భగవత్పాదులు బాల్యంలో భిక్షాటనకు వెళ్లినపుడు.. ఆయనకు పెట్టడానికి ఉసిరికాయ తప్ప తన వద్ద ఏమీ లేదని ఒక నిరుపేద గృహిణి బాధపడింది. దీంతో కరుణాలయమైన శంకరులహృదయం ఆర్ద్రమైంది. మనసు సంకల్పించింది. ఆయన అమృత వాక్ప్రవాహం.. సర్వైశ్వర్యదాయినియైున శ్రీమహాలక్ష్మిని అశువుగా స్తుతించింది. శంకరులే అర్థిస్తే అమ్మ కదలదా? కరగదా? కనికరించదా? అదే జరిగింది. కనకధార సాగింది. బీద యిల్లాలి యిల్లు సర్వసంపదాలయమైంది. ఆమె దీనత్వం లయించింది. దివ్యత్వం పల్లవించింది. ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి శంకర హృదయగీతికే ఈనాడు ఆరాధనా గీతికగా, జనుల నాల్కలపై నడయాడే దివ్యగానమైంది. శ్రీ మహాలక్ష్మిని ఎట్లా ప్రార్థిస్తే, ఎట్లా అర్థిస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుందో పేదరికం నశించి సంపద లభిస్తుందో సూచించే కనకధారాస్తవం దివ్యకవితా మాలికైంది. అదీ పరుల కోసం చేసే సిద్ధపురుషుల గొప్పదనం. పరుల కోసం చేసే ప్రార్థనలో ఉన్న గొప్పదనం. అదే అసలు ప్రార్థన. అదే శుద్ధి. అదే సిద్ది. ధనమే బలంగా మారిన ఆధునిక ప్రపంచానికి, ఆచార్య స్వామి సందేశం యిదే.