Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణవ్యాప్తంగా బీజేపీ 50 బహిరంగ సభలు నిర్వహించనుంది. పాత పది జిల్లాల్లో నిర్వహించనున్న సభలకు అమిత్‌ షా హాజరు కానున్నారు. ప్రధాని మోదీ కూడా ఒకటి, రెండు బహిరంగ సభలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఢిల్లీలో జరిగిన సమీక్షలో పార్టీ నేతలకు భరోసా లభించింది. ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా తెలంగాణ నేతలతో అమిత్‌ షా సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోందని పార్టీ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.
దానిని అమిత్‌ షా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలు నైతికంగా బలహీనపడాల్సిన అవసరం లేదని, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా కార్యకర్తలను సంసిద్ధం చేయాలని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ చాలా బలహీనంగా ఉందని, బీజేపీ పుంజుకునేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడిందని, గట్టిగా ప్రయత్నిస్తే పార్టీకి రెండో స్థానం దక్కుతుందని అమిత్‌ షా అన్నట్లు సమాచారం. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, ఒడిసాల్లో బీజేపీకి అనూహ్యమైన భవిష్యత్తు ఉందని, ఫలితాలు వస్తే కానీ విమర్శకుల కళ్లు తెరుచుకోవని ఆయన చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రచారానికి మోదీ: లక్ష్మణ్‌
తెలంగాణలో ప్రచారానికి రావాలని ఆహ్వానించగా మోదీ అంగీకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అధిష్ఠానం పచ్చజెండా ఊపిందన్నారు. పాలమూరులో 15న జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారని చెప్పారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖం పూరిస్తామన్నారు. ఈ సభలోనే కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందన్నారు. ప్రచారంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొంటారని పార్టీ నాయకుడు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉందని, ముందస్తు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కాంగ్రె్‌సతో అపవిత్ర పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.