Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుంటే తమ కుటుంబమంతా రాజకీయాల నుంచి తప్పుకొంటామని.. మరి టీఆర్‌ఎస్‌ గెలవకుంటే కుటుంబంతో సహా కేటీఆర్‌ రాజకీయ సన్యాసం చేస్తారా అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతి సవాల్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ గెలవకపోతే రాజీనామా చేస్తారా..’ అన్న కేటీఆర్‌ సవాల్‌ను బేషరతుగా స్వీకరిస్తున్నానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ 70 స్థానాలకు తగ్గకుండా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఇప్పటిదాకా చేసిందేమిటని.. ప్రజలు కేసీఆర్‌ కుటుంబానికి ఓట్లు ఎందుకు వేస్తారని ఉత్తమ్‌ ప్రశ్నించారు.  టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయంటున్న సీఎం కేసీఆర్‌ దీనిపై మాట్లాడాలని.. వంద సీట్లు రాకుంటే కేసీఆర్‌ కుటుంబంతో సహా రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్‌ చేశారు. కేసీఆర్‌ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని విమర్శించారు. తాను సైనికుడిగా చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధాల్లో పాల్గొని.. ప్రాణాలకు తెగించి పోరాడానని చెప్పారు. ప్రజలకు మరో రూపంలో సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
‘‘టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్‌ ఏం చెప్పాడో గుర్తుందా? అధికారంపై, పదవులపై వ్యామోహం లేదని.. మియా, బీబీ ఇద్దరమేనని ప్రజలకు అనేక సభల్లో చెప్పారు. కొడుకు, బిడ్డ అమెరికాలో స్థిరపడ్డారని, ఎలాంటి స్వార్థమూ లేదని చాలాసార్లు అన్నారు. ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్‌ కుటుంబమే దోపిడీ చేస్తోంది…’’ అని ఉత్తమ్‌ ఆరోపించారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్, కేసీఆర్‌ చేసిందేమీ లేదని.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ రాష్ట్రాన్ని
ఇచ్చారని చెప్పారు.

ప్రశ్నిస్తే.. జైల్లో వేస్తారా?
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులపై దాడులు, గిరిజనులపై నిర్బంధం, రైతులకు బేడీలు వేస్తూ అవమానిస్తోందని ఉత్తమ్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి నిరాకరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులను అమానుషంగా హత్య చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి, జైల్లో వేస్తున్నారని.. కొత్తకొత్త చట్టాలు తెచ్చి సోషల్‌ మీడియాలోనూ భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడినవారిపై టీఆర్‌ఎస్‌ నేతలకు గౌరవం లేదని.. గద్దర్, కోదండరాం, విమలక్క, మంద కృష్ణ వంటి తెలంగాణ పోరాట యోధులను అమానవీయంగా అరెస్టులు చేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా విప్లవం
తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం వస్తోందని.. టీఆర్‌ఎస్‌ కోట గోడలతో సహా కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కచ్చితమన్నారు. కేసీఆర్‌ కుటుంబ రాజకీయ మనుగడ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సమావేశంలో సీఎల్పీ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన
కుంతియాతో భేటీలో టీకాంగ్రెస్‌ నేతలు
వచ్చే ఎన్నికల్లో ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాకు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు కొందరు సూచించారు. గురువారం ఆయనతో జరిపిన వ్యక్తి గత భేటీల సందర్భంగా.. ఆయా నేతలు తమ అభిప్రాయాలను, పార్టీ పటిష్టానికి, భవిష్యత్తు కార్యాచరణకు అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించడం వల్ల ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం కష్టమవుతుందని.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని కొందరు సూచించినట్లు తెలిసింది. ఇక పార్టీలో చేరికల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, పార్టీ జిల్లా స్థాయి నాయకులను సంప్రదించి అభిప్రాయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఇక టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి పార్టీ దూకుడుగా వ్యవహరించాలని కొందరు సూచించారు. మొత్తంగా రెండు రోజుల పాటు జరిగిన వ్యక్తిగత సమావేశాల్లో 100 మందికి పైగా కాంగ్రెస్‌ నేతలతో కుంతియా సమావేశమయ్యారు.

సర్వేల ఆధారంగానే టికెట్లు
ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్లు ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రకటించా రు. ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ పోటీ చేస్తారని ఇటీవల ఉత్తమ్‌ పేర్కొన్న నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు గురువారం గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఉత్తమ్‌.. బహిరంగ సభల్లో కొన్ని మాట్లాడాల్సి వస్తుందని.. అయితే వచ్చే ఎన్నికలకు ముందు సర్వే చేసి, గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని చెప్పారు.