Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నగరంలోని ఐటీ ఉద్యోగులు నిద్రకు బాగా దూరం అవుతున్నట్టు తాజాగా ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి చేసిన సర్వేలో వెల్లడైంది. కొద్ది నెలలుగా నగర ఐటీ ప్రొఫెషనల్స్‌పై డాక్టర్‌ నళిని నేతృత్వంలోని బృందం 500 మంది ఐటీ ఉద్యోగుల నిద్రకు సంబంధించిన అంశంపై అధ్యయనం చేసింది. 25 – 45 ఏళ్ల మధ్య వయస్కులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
సగం మందికి నిద్ర సమస్యే..
సర్వేలో పాల్గొన్న వారిలో 60శాతం మందికి నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. అందులో 38 శాతం మంది గురకతో బాధపడుతున్నారు. పైగా సర్వేకు ఎంచుకున్నవారంతా పగలు మాత్రమే పనిజేసేవారు కావడం విశేషం. నెలకు కనీసం ఒక్కసారి కూడా వ్యాయమం చేయనివారి సంఖ్య 39 శాతంగా ఉంది. ఇక 96 శాతం మంది నిద్రపోయే ముందు కూడా సెల్‌ఫోన్స్‌, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్‌లను వాడుతున్నారని తేలింది. నిద్రపోయే గంట ముందు వరకు కూడా49 శాతం మంది ఆఫీసుకు సంబంధించిన వర్క్స్‌ను చేస్తున్నట్టు వెల్లడించారు. మరి కొంతమంది నిద్ర మధ్యలో మెలుకువ వస్తే… వెంటనే సెల్‌ఫోన్‌లో మెయిల్స్‌ చెక్‌ చేసుకుంటున్నారట. నిద్రకు సంబంధించి 30 రకాల ప్రశ్నలను వారిపై వేసి సమాధానాలు రాబట్టారు. మొత్తంగా 50 శాతం ఉద్యోగుల నిద్రలేమి సమస్యలకు ప్రధాన కారణం పడుకునేముందు వరకు కూడా ఎలకా్ట్రనిక్‌ వస్తువులతో గడపటమేనని తేలింది. అలాగే మోతాదుకు మించి కాఫీ,టీ, కూల్‌డ్రింక్స్‌ తాగడం, వ్యాయమం లేకపోవడం, జీవనశైలి విధానం కూడా నిద్ర సమస్యలకు కారణాలుగా తేలింది.
నిద్రపట్టకపోవడానికి అసలు కారణమిదే…
ప్రతి ఒక్కరూ నిద్రపోవాలంటే మెదడులోని మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. గాఢ నిద్రపట్టకపోవడానికి ప్రధాన కారణం హార్మోన్‌ తగినంత ఉత్పత్తి కాకపోవడమే. రాత్రిపూట ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, ట్యాబ్స్‌, టీవీల నుంచి వచ్చే తెలుపు, బ్లూ, ఆకుపచ్చ కాంతి ఎక్కువసేపు చూడటం వల్ల కంటిపై ఒత్తిడి పెరిగి మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కాకుండా ఆగిపోతోంది. రోజుల తరబడి ఇటువంటి ఇలాంటి జీవన విధానాన్నే కొనసాగిస్తే నిద్రరావడం ఆగిపోతుంది.
నిద్రపోకపోతే ఏమవుతుందంటే…
శారరీక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఉదయం లేవగానే తలనొప్పి మొదలవుతుంది. నిద్రపోయిన ఫీలింగ్‌ ఉండదు. పగలు కునుకు వేయాలనిపిస్తుంది. డ్రైవింగ్‌లోనూ నిద్ర వస్తుంది. నీరసంగా ఉంటూ… ఒకటే ఆవలింతలు వస్తాయి. పనిపై శ్రద్ధ ఉండదు. రాత్రిపూట గురకపెట్టడం, నిద్రమధ్యలోనే మేల్కోవడం, టాయిలెట్‌కు వెళ్లడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. బీపీ, షుగర్‌, స్థూలకాయం, డిప్రెషన్‌లోకి వెళ్లడం, గుండె సంబంధిత జబ్బులు రావడం, మతిమరుపు, జుట్టు రాలడం, హార్మోన్స్‌ సమతుల్యత దెబ్బతినడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, లైంగిక జీవితంలో ఆసక్తి లేకపోవడంతో పాటు రకరకాల సమస్యలు వస్తాయి.
మంచి నిద్రకు మార్గాలివే..
  • పగలు కునుకు తీయవద్దు.
  • నిత్యం వ్యాయామం చేయాలి.
  • నిద్రపోయేముందు మితంగా భుజించాలి.
  • సహజసిద్ధమైన కాంతిలో నిద్రించాలి.
  • పడుకునేముందు పుసక్తపఠనం చేస్తే మంచిది.
  • పడుకునే గంటముందు ఎలకా్ట్రనిక్‌ వస్తువులను వాడటం ఆపేయాలి.
  • కెఫిన్‌, నికొటిన్‌, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
  • రోజూ ఒక సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.