Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరుమల ఆలయంలో కొలువైన శ్రీనివాసుడు తొమ్మిది అడుగుల నిలువెత్తు భారీ విగ్రహం. నల్లని మేనిఛాయతో నిగనిగలాడుతూ ఉండే సౌందర్యం. తిరునామధారి అయిన ఆ నల్లనయ్య గడ్డం మీద బెత్తెడంత తెల్లని మచ్చ కనిపిస్తుంది. అది కర్పూరం. అరచేతి నిండా కర్పూరం తీసుకుని స్వామి గడ్డం కింద అ ద్దుతారు. ఎందుకిలా…?! దీనికో కథ ప్రచారంలో ఉంది. అనగనగా రోజుల్లో తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి. క్రూర మృగాలు. అర్చకులు ప్రతి ఉదయం కొండ ఎక్కి వచ్చి స్వామికి పూజా కైంకర్యాలు నిర్వహించి చీకటి పడే వేళకి కొండ దిగేసేవారు. తిరిగి సూర్యోదయం తర్వాతనే ఆలయం తలుపులు తె రిచేవారు. తిరుమలలోనే ఉండి స్వామి సేవ చేయ డానికి ఎవరూ సాహసించేవారు కారు. రామానుజా చార్యులు కోరిక మేరకు ఆయన శిష్యుడు అనంతాళ్వార్‌, తన భార్యతో సహా తిరుమలలోనే ఉండడానికి సిద్ధమయ్యాడు. శ్రీనివాసుడి సేవలకు నిత్యం పూలు కా వాలి. ఆలయం వెనుక భాగంలో పూల తోట పెం చాలనుకున్నాడు. పూల మొక్కలు నాటడానికి మట్టి తవ్వుతున్నాడు. నిండు గర్భంతో ఉన్న అనంతాళ్వార్‌ భార్య కూడా ఆయనకు సహకరిస్తోంది. ఎర్రటి ఎండలో ఆ జంట కష్టం చూసి శ్రీనివాసుడు చలించిపోయాడు.
    అనంతాళ్వార్‌కి సాయం చేయాలని తలచాడు. బాలుడి రూపంలో వచ్చి తాను కూడా మట్టి తవ్వుతానని అడిగాడు. పనిలో మునిగిపోయి ఉన్న అనంతాళ్వార్‌ ..‘పిలగాడివి నువ్వేం చేస్తావ్‌..పో’ అని చెప్పాడు. బాలుడు వెళ్ళిపోలేదు. అనంతాళ్వార్‌ పక్కనే చేరి తాను కూడా తవ్వడం మొదలు పెట్టాడు. చెప్పినా విననందుకు అనంతాళ్వార్‌కి కోపం నసాళానికి అంటింది. చేతిలో ఉన్న గడ్డపారను బాలుడి మీదకు విసిరాడు. గడ్డపార మొన బాలుడి గడ్డానికి తగిలింది. గాయపడ్డ గడ్డాన్ని అరచేతితో అదిమి పట్టుకుని బాలుడు అక్కడి నుంచీ వెళ్ళిపోయాడు. పూజల కోసం అనంతాళ్వార్‌ గర్భాలయంలోకి వెళ్ళాడు. స్వామి నల్లని విగ్రహం గడ్డం నుంచి నెత్తురు ధారగా కారుతోంది. తల్లడిల్లిపోయిన అనంతాళ్వార్‌ స్వామి హారతి కోసం తెచ్చిన కర్పూరపు గడ్డను వెంటనే నెత్తురు ఆగడానికి గడ్డానికి అద్దాడు. రక్త ధార ఆగిపోయింది. స్వామి గడ్డం మీద తెల్లని కర్పూరపు ముద్ద అలాగే ఉండిపోయింది. అదే ఆ తర్వాత ఆచారంగా మారిపోయింది. నేటికీ గడ్డం కింది భాగంలో పచ్చకర్పూరం అద్దుతారు.