Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని చీకటి. చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం. ఏం చూడబోతున్నామో తెలియని ఉత్కంఠ. అప్పటిదాకా చూసిన వాటితో కలిగిన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఇంకే అద్భుతం ఆవిష్కృతమవుతుందోనని అనుకుంటూ, దానికోసం ఎదురు చూస్తున్న క్షణం. చిన్నగా ‘టిక్‌’ మనే స్విచ్‌ వేసిన శబ్దం… అంతే! చీకట్లో నిలుచున్న వారికి అభిముఖంగా ఒక్కసారిగా పరుచుకున్న లేత రంగుల వెలుగు దొంతరులు. ఆ వెలుగుతో పాటు ఆవిష్కృతమైన ఒక మహాద్భుత దృశ్యం… ఒక్కసారిగా విప్పారిన నయనాలు… ‘వావ్‌’ అంటూ నోటి నుంచి వెలువడిన నిబిడాశ్చర్యపు పదం. కనుల ముందున్న ఆ సుందర దృశ్యం – మనసును మీటిన విచిత్రానుభూతి. ఆ దృశ్యం కానీ, అది కలిగించే అనుభూతిని కానీ వర్ణించడానికి పదాలు దొరకవంటే అతిశయోక్తి కాదేమో! విశ్వకర్మను మించిన సృజనకారుడెవరో తీరికూర్చుని తన కళాదృష్టినంతా కేంద్రీకరించి సృజియించిన దేవలోకపు సభా మందిరమేమో అనిపించేంతటి అద్భుతం. చూడడానికి రెండు కళ్లూ చాలవేమో అనిపించే అద్వితీయ దృశ్యం. మనం పౌరాణిక సినిమాల్లో చూసే ఇంద్రలోకపు సభాస్థలిలా ఉంది. కోట్ల యుగాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఓ గుహాంతర్భాగంలోది ఈ అపురూప దృశ్యం.
రెండు అద్భుతాలు!
నిజానికది ఒక గుహ కాదు. అనేక గుహల సముదాయం. దక్షిణాఫ్రికాలో చారిత్రకంగా అత్యంత ప్రాధాన్యం కలిగి, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన రెండు గుహల సముదాయాల్లో ఒకటి. పేరు ‘కాంగో కేవ్స్‌’. వానరం నుంచి మానవుడిగా పరిణామం చెందే క్రమంలో సంతరించుకున్న వివిధ దశల్లో పూర్ణ మానవ రూపానికి చేరువగా నిలిచి, ‘హోమినిన్‌’గా పిలవబడుతున్న అర్థమానవుడి కపాల భాగం లభించిన ‘స్టర్క్‌ఫాంటీన్‌’ గుహల సముదాయం రెండవది.
 
శతాబ్దాల నాటి పర్యాటక కేంద్రం
చుట్టూ పచ్చపచ్చని పావడాలు కట్టుకున్న పెద్ద పెద్ద స్వార్ట్‌బర్గ్‌ పర్వతాలు. నట్టనడుమ మధ్యస్థంగా ఉన్న ఓ పర్వతం. దానికింద ప్రారంభించి కొంత దూరం వరకు ప్రకృతి సృజియించిన మహాకళాఖండమే కాంగో కేవ్స్‌. పశ్చిమ కేప్‌ ప్రాంతంలోని అవుడ్‌షూర్న్‌ పట్టణానికి ఉత్తరంగా 30 కి..మీ దూరంలో ఉన్న ఈ గుహలు దక్షిణాఫ్రికాలోనే శతాబ్దాల నుంచి పర్యాటక ఆకర్షణ కలిగినవి. రాతియుగం తొలినాళ్ల నుంచే ఇక్కడ ఆదిమానవులు నివసించినట్లుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
కళ్లు తిప్పనివ్వని కాంగో కేవ్స్‌!
విశాఖపట్నం సమీపంలోని అరకు అడవుల్లో ఉన్న బొర్రా గుహలకు ఈ కాంగో గుహలకు అనేకవిధాలుగా సారూప్యముంది. అయితే కాంగో గుహల్లోని అద్భుతాకృతులు నిస్సందేహంగా విశిష్టమైనవి. ఈ గుహల్లోకి అడుగుపెడుతూనే అత్యాధునిక శిల్పంలా కనిపించే ఒక ఆకృతి స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి కటిక చీకటి చాచుకున్న గుహల్లోని అందాలు చూడడానికి అక్కడక్కడా విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. పది అడుగులు వేయగానే కాస్త విశాలంగా కనిపించే ప్రాంతంలో ఆదిమానవులు వంట ఏర్పాట్లలో నిమగ్నమైన దృశ్యం సజీవమా అనిపించేలా ఉన్న శిల్పాకృతులతో దర్శనమిస్తుంది.
వాటికి చేరువలోనే ఓ గోడ మీద పూర్వీకులెవరో గీసిన ఏనుగు బొమ్మ ఆకట్టుకుంటుంది. కానీ అది అంత ప్రాచీనమైనది కాదని అంటారు. అది దాటాక మలుపులు, వంపులు, వాలుతో కొంత దూరం సాగితే ఎవరో తీర్చిదిద్దినట్లుగా చుట్టూ రకరకాల ఆకృతులతో అలంకరించబడిన గుహల కుడ్యాలు చూపరులను కట్టిపడేస్తాయి.
గుహలో సంగీత కచ్చేరీలు!
గుహ మధ్యలో నృత్యశాల లాంటి విశాలమైన ప్రదేశం ఉండటం ఒక వింతైతే; ఒకప్పుడు అక్కడ సంగీత కచ్చేరీలు నిర్వహించడం మరో వింత. ఆ కచ్చేరీల కోసం గుహల్లో భాగంగానే కనిపించేలా చిన్న వేదికను ఏర్పాటు చేశారు. సంగీత కళాకారులకు, సంగీత ప్రియులకు అది అద్భుతమైన అనుభవమే అయినప్పటికీ అక్కడి ప్రకృతి సంపదను కొందరు దోచుకుపోవడం లేదా ధ్వంసం చేయడంతో ప్రభుత్వం ఆ కచ్చేరీలను నిలిపివేసింది. ఆ ప్రాంతాన్ని దాటి వెళుతుంటే గుహల గోడలలో, పైకప్పు అంచుల్లో చెక్కినట్లుగా అడుగడుగునా ఒకదానిని మించి ఒకటిగాఉన్న కళారూపాలు… ఆపైన గుహభారాన్ని మొత్తంగా మోస్తున్నట్లుగా ఉండి కళలు ఉట్టిపడుతున్న ఒంటిస్తంభం… ప్రపంచంలో మరే గుహలోనూ చూడలేని ఒక మహాద్భుతం కళ్ల ముందుండగా చూపును తిరిగి లాక్కోవడానికి శతప్రయత్నం చేయాల్సిందే.
మానవాళి చరితకు మహాసాక్ష్యం
దక్షిణాఫ్రికాకు ఆర్థిక రాజధానిలాంటి జోహన్స్‌బర్గ్‌కు చేరువలో ఉన్న ప్రాంతం మరోపెంగ్‌. మనిషి జన్మకు మూలస్థానంగా భావిస్తున్న ఆ ప్రాంతాన్ని, ఆ గుహల్ని సందర్శించడమంటే – వేల తరాలనాటి మన జేజమ్మ ‘మిసెస్‌ ప్లెస్‌’ను తిలకించి, ‘ఔనే, నువ్విలా ఉండేదానివా? అప్పటినుంచి సాగిన ప్రస్థానంలో ఇప్పటి మా ఆధునిక రూపాన్ని నీకు చూపించడానికి వచ్చామే’ అని చెప్పుకోవడమే. మానవాళి చరితకు మహాసాక్ష్యంగా నిలిచిన జేజెమ్మ అడుగులు పడిన చోట మనమూ అడుగులు వేసి ఆమె సంచరించిన ప్రాంతంలో మనమూ తారాడుతున్నామన్న అనుభూతి నిజంగా మాటలకందనిది.
జోహన్స్‌బర్గ్‌కు గంట ప్రయాణ దూరంలో ఉన్న ‘క్రేడిల్‌ ఆఫ్‌ హ్యూమన్‌కైండ్‌’ ప్రాంతమంతా మనదేశంలో మనకి చేరువలో మనం ఎప్పుడూ తిరుగుతూన్న ప్రాంతం మాదిరిగానే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మన బెలూం గుహలున్న ప్రాంతంలా – ఎటు చూసినా దుబ్బలు, తుప్పలు, చిన్న చిన్న గుట్టలు, రాళ్లు రప్పలు తేలిన ప్రాంతంలానే కనిపిస్తుంది. 1999లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన క్రెడిల్‌ ఆఫ్‌ హ్యూమన్‌కైండ్‌ ప్రాంతం పరిధి దాదాపు 470 కి.మీ. ఇక్కడ సుమారు 300 గుహలు, చెప్పుకోదగిన సంఖ్యలో శిలాజాలు లభించిన ప్రాంతాలు 15 వరకు ఉన్నాయి. వాటిలో స్టర్క్‌ఫాంటీన్‌ గుహలు ప్రధానమైనవి. మానవుడికి చేరువగా ఉన్న అర్ధమానవులు, అనేక రకాల పురాతన జీవజాలాల అవశేషాలు అసంఖ్యాకంగా ఈ గుహల్లో శిలాజాల రూపంలో లభించాయి.
వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందింది 20 లక్షల 50వేల సంవత్సరాల క్రితం జీవించిన ఓ అర్థమానవ మహిళ ‘మిసెస్‌ ప్లెస్‌’ కపాలం.మిసెస్‌ ప్లెస్‌ కపాల భాగం లభించిన గుహ ఉపరితలంలో మైదాన ప్రాంతంలో ఉన్న ముఖ ద్వారం లాంటి పెద్ద కంత కానీ ఆ గుహల్లోకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన మెట్ల భాగం కానీ ఏమాత్రం తేడా లేకుండా మన బెలూం గుహల్లో మాదిరిగానే ఉన్నాయి. లోపల కూడ చాలా భాగం బెలూం గుహల్లో తిరుగుతున్నట్లే భ్రమింపజేసే విధంగా ఉంటుంది. ఆ గుహల్లో మాదిరిగానే 60 మీటర్ల అడుగున నీటి మడుగు, అందులో చిన్న చిన్న జీవచరాలు అక్కడా ఉన్నాయి. ఇంతటి సారూప్యం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు.
మరోపెంగ్‌ ప్రాంతంలో అపారంగా ఉండే డోలమైట్‌ ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు స్టర్క్‌ఫాంటీన్‌ గుహలు బయటపడ్డాయి. అక్కడ అపురూపమైన చారిత్రక సంపద లభించడంతో ప్రభుత్వం డోలమైట్‌ తవ్వకాల్ని నిలిపివేసింది. స్టర్క్‌ఫాంటిన్‌ గుహల్లో లభించిన మిసెస్‌ ప్లెస్‌ కపాల భాగాన్ని బట్టి ఆమె ఆ గుహల్లోనే జీవించి మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించడం లేదు. ఆ గుహలకు చేరువలో ఎక్కడో మనుగడ సాగించి మరణిస్తే ఆమె శరీరం శిథిలమయ్యాక అస్థిపంజర భాగాలు కాలక్రమంలో వర్షపు నీటి ప్రవాహ వేగానికి ఎటెటో కొట్టుకుంటూ పోయి ఉండవచ్చని, ఆమె కపాల భాగం ఈ గుహల ముఖద్వార భాగానికి చేరుకుని వర్షపు నీటితో కలిసి లోపలికి జారిపడి అక్కడే నిక్షిప్తమై ఉండవచ్చని శాస్త్రజ్ఞుల భావన.
ఈ గుహల్లోనే అచ్చెరువొందించే మరో అస్థిపంజరం లభించింది. మిస్టర్‌ లిటిల్‌పుట్‌ అని శాస్త్రవేత్తలు పిలుచుకునే ఓ బాలుడి అస్థిపంజరం ఇది. ఆధునిక మానవుడి రూపానికి చేరువగా పరిణామం చెందినప్పటికీ శరీర నిర్మాణాకృతి కారణంగా కిందకు చూడలేని తనం వల్ల నడుస్తూ నడుస్తూ గుహద్వారం వరకు వచ్చి కాలు జారి పడి గుహలోనే మగ్గి మగ్గి ఆ బాలుడు శాశ్వత నిద్రలోకి జారుకుని ఉంటాడని వారి ఊహ.
అందుకే అస్థిపంజర భాగాలన్నీ ఒకేచోట లభించాయని భావిస్తున్నారు. ఇవే కాకుండా అనేక జంతువులూ, సరీసృపాల కంకాళాల భాగాలు లెక్కకు మించి ఈ ప్రాంతంలో లభించడంతో పురాతన జీవాల శిలాజాల ఖనిగా శాస్త్రవేత్తలు దీన్ని అభివరిస్తుంటారు. ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలతో సుందరమైన దేశంగా, రకరకాల జాతుల ప్రజలతో ఇంద్రధనస్సు దేశంగా పేరు పొందిన దక్షిణాఫ్రికాలో పురాతన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడ చాలా ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే వీటి సందర్శన దక్షిణాఫ్రికా పర్యటనను ఓ అద్భుతమైన టూర్‌గా మలచి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోయేలా చేస్తుందనటం నిస్సందేహం.
 
మిసెస్‌ ప్లెస్‌
స్టర్క్‌ఫాంటీన్‌ గుహల్లో 1942లో లభించిన ‘మిసెస్‌ ప్లెస్‌’ కపాలం మూడొంతుల భాగమే లభించింది. చెక్కు చెదరని ఈ కపాలం ఆధారంగా ఊహించి నాటి అర్ధ మానవ మహిళ రూపానికి శాస్త్రవేత్తలు ఓ ఆకృతినిచ్చారు. ఆ మహిళకు ‘మిసెస్‌ ప్లెస్‌’ అని పేరు పెట్టారు. భూమి మీద ఇప్పటి వరకు లభించిన జీవ అశేషాలలో అపురూపమైన చారిత్రక సంపదగా భావిస్తున్న ఈ కపాలాన్ని ప్రస్తుతం ప్రిటోరియా మ్యూజియంలో భద్రపరిచారు. స్టర్క్‌ఫాంటీన్‌ గుహల్లో దాని నమూనాలు మాత్రమే దర్శనమిస్తాయి.
చూడగలిగేది కొంతే!
కాంగో కేవ్స్‌లోని రమణీయమైన ఆకృతులన్నీ గుహల ఉపరితలం నుంచి, గోడలమీంచి కోట్ల ఏళ్లుగా స్రవించే నీటిలో కలిసి ఉన్న సున్నపురాయి నిక్షేపాలు కాలక్రమంలో ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. మన బుర్రా గుహల్లోనూ ఇదే ప్రక్రియ జరిగింది. కాంగో గుహల్లో కొద్దిభాగాన్నే పర్యాటకులకు అందుబాటులో ఉంచారు. ఆ గుహల సందర్శన కూడా రెండు రకాలు. ఒకటి – గంటపాటు సాగే హెరిటేజ్‌ టూర్‌. దీంట్లో అరవై, డెబ్భై మీటర్ల వరకు గుహల్ని చూపిస్తారు. రెండవది – గంటన్నరపాటు సాగే అడ్వెంచర్‌ టూర్‌. సన్నని దారుల్లో, గుహల్లో ప్రయాసతో పాకుతూ సాగే పర్యటన ఇది. ఇందులోని ఆకృతులన్నీ మందమైన సున్నపురాయి పొరలతో ఏర్పడినవే. అప్పట్లోనే సందర్శకులు సున్నపురాతి కళాఖండాలను విరగగొట్టి పట్టుకుపోతుండడంతో దానిని అరికట్టడం కోసం 1820లలో కఠినమైన చట్టాలను అమలులోకి తెచ్చారు.
ఎక్కడున్నాయి?
  • కాంగో కేవ్స్‌ దక్షిణాఫ్రికాలోని పశ్చిమ కేప్‌ ప్రాంతంలో అవుడ్‌షూర్న్‌ పట్టణానికి ఉత్తరంగా 30 కి..మీ దూరంలో ఉన్నాయి.
  • దక్షిణాఫ్రికాలోని జోహన్స్‌బర్గ్‌కు సుమారు 35 కి..మీ. దూరంలో స్టర్క్‌ఫాంటీన్‌ గుహలున్నాయి.
యుగాలలోకి ప్రయాణం!
స్టర్క్‌ఫాంటిన్‌ గుహలకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో మరోపెంగ్‌ మ్యూజియం ఉంది. ఓ చిన్న గుట్ట ఉపరితలం మీద డోమ్‌ రూపంలో ఓ ఆకృతిని ఏర్పాటు చేసి గుట్ట అంతర్భాగంలో దీనిని ఏర్పాటు చేశారు. బిగ్‌బ్యాంగ్‌ తర్వాత పుడమి ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా సాగిన పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే అద్భుత మ్యూజియం ఇది. అందులో అనేక జీవులు, మానవ పూర్వీకుల అస్థిపంజర భాగాలు, రాళ్ల పనిముట్లు, మానవాకృతులకు దగ్గరగా ఉన్న జీవుల శిల్పాలు, విజ్ఞానపరమైన అనేక విషయాలతో ఆ మ్యూజియంను తీర్చిదిద్దారు. పర్యాటకులను చెక్క పడవలో ఎక్కించి తిప్పుతూ చరిత్ర పూర్వపు యుగం, అగ్ని, మంచు, లోహ యుగాలలోంచి ఆధునిక యుగంలోకి సాగుతున్న అనుభవాన్ని అందించడం ఈ మ్యూజియంలోని ప్రత్యేకత.