Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దశావతారాల్లో రామచంద్రమూర్తి అవతారం తర్వాత వచ్చేవి బలరామ అవతారం, కృష్ణభగవానుడి అవతారం. దేవకీవసుదేవుల సుతుడు కృష్ణుడు కాగా.. రోహిణి, వసుదేవుల కుమారుడు బలరాముడు. దేవకి అష్టమగర్భుని చేత సంహరింపబడతావని కంసునికి అశరీరవాణి చెప్పినప్పటి నుంచి.. ఆయన దేవకి కడుపున పుట్టిన శిశువులందరినీ హరిస్తూ వచ్చాడు.
అయితే, ఏడో గర్భం వచ్చేటప్పటికి పరమాత్మ ఒక విచిత్రమైన స్థితిని ఆవిష్కరించాడు. అదేమిటంటే.. నందుడు, వసుదేవుడు మంచి స్నేహితులు. వసుదేవుడు కారాగారంలో ఉన్నప్పుడు.. ఆయన భార్య రోహిణి నందుని వద్ద ఉన్నది. యోగమాయ దేవకీదేవి గర్భంలోని పిండాన్ని సంకర్షణం చేసి.. అనగా కడుపులోంచి పిండాన్ని తీసుకువెళ్లి రోహిణి కడుపులో ప్రవేశపెట్టింది. గర్భసంకర్షణం చేత పుట్టినవాడు కనుక.. బలరాముడిని సంకర్షణుడు అని కూడా అంటారు.
బలరాముడు సాక్షాత్తూ శేషుని అంశ. ఆయన ఆయుధాలు రోకలి, నాగలి. శ్రీరామాయణంలో లక్ష్మణుడుగా వచ్చిన శేషుడు.. అన్నగా రామచంద్రమూర్తి చాలా కష్టాలు పడ్డాడని భావించి ఈసారి తాను అన్నగారుగా రావాలని సంకల్పంచేసి వచ్చిన అవతారమే బలరామావతారం. భీముడికీ, దుర్యోధనుడికీ గదాయుద్ధం నేర్పినవాడు బలరాముడే. అయితే, ఆయన దుర్యోధన పక్షపాతి. అందుకే కురుక్షేత్రంలో కృష్ణుడు పాండవుల పక్షాన ఉండడంతో.. తానెంతో అభిమానించే దుర్యోధనుని వెనుక ఉండలేక తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. యుద్ధం పూర్తయ్యే సమయానికి తిరిగి వస్తాడు. మ ర్నాడే.. భీమ, దుర్యోధనుల గదాయుద్ధం.
ఆయుద్ధంలో భీముడు తన గదతో దుర్యోధనుని తొడలపై మోదగానే అతడు పడిపోయాడు. బలరాముడు అది అన్యాయమన్నాడు. దుర్యోధనుణ్ని చంపిన భీముణ్ని నిర్జిస్తానంటూ నాగలి, రోకలి పట్టుకుని భీముని మీదకు వెళ్లాడు. అప్పుడు కృష్ణుడు.. అది భీముడి ప్రతిజ్ఞ అని, మాట నిలబెట్టుకోవడం సుక్షత్రియుడి లక్షణమని, అలాగే తొడలు విరిగి పడిపోవాలంటూ దుర్యోధనుడికి మైత్రేయి మహర్షి శాపం ఉందని అందుకే అలా జరిగిందని వివరించడంతో శాంతిస్తాడు. చివరికి కృష్ణ భగవానుడు శరీరం విడిచిపెట్టే సమయంలోనే తానూ శరీరాన్ని విడిచిపెడతాడు.