Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరువనంతపురం: కేరళను ముంచెత్తుతున్న వరదల ప్రభావం తన నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో వివరిస్తూ ఓ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. చెంగన్నూర్‌ ఎమ్మెల్యే సాజి చెరియన్‌ శుక్రవారం సాయంత్రం ఓ మలయాళ టీవీ స్టూడియోలో వరదల ప్రభావం వల్ల నష్టపోతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ప్రాంతాన్ని కాపాడుకోవడానికి హెలికాప్టర్లు కావాలి. ప్రధాని మోదీ దయచేసి హెలికాప్టర్లు ఇవ్వండి. ఒక వేళ మీరు ఈ సహాయం చేయకపోతే 50,000 మంది ప్రజలు మృత్యువాతపడక తప్పదు. గత నాలుగు రోజులుగా నావిక దళ సహాయం కావాలని అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. వాయుమార్గం ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమొక్కటే ఇప్పుడున్న మార్గం. దయచేసి ఆదుకోండి’ అంటూ ఎమ్మెల్యే చెరియన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన పాల్గొన్న కార్యక్రమానికి వందల సంఖ్యలో వరద బాధితులు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించారు.

కాగా, చెరియన్‌ నియోజకవర్గమైన చెంగన్నూర్‌ ప్రాంతంలో 10నావికా దళ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ సహాయక చర్యలు చేపట్టడానికి భారీగా అడ్డంకులు ఏర్పడుతున్న కారణంగా చెంగన్నూర్‌ నియోజకవర్గంలో వరదల ప్రభావం అత్యధికంగా ఉందని పేర్కొన్నారు. శనివారం 79పడవలతో ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు, 400మత్స్యకారుల పడవలతో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.