Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మరికొద్ది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) పార్టీకి మద్దతు తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యూహ చర్చల్లో భాగంగా శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన ఆయన.. మాజీ ప్రధాని, జేడీఎస్‌ కురువృద్ధుడు హెచ్‌డీ దేవేగౌడను కలుసుకున్నారు. గౌడతో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలతోపాటు కర్ణాటక-తెలంగాణల మధ్య నెలకొన్న సమస్యలపైనా కేసీఆర్‌ చర్చించారు. ఈ భేటీలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ, సీఎం వెంట సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, పలువురు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పాల్గొన్నారు.

పెద్దాయన హామీ ఇచ్చారు: దేవేగౌడతో భేటీ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ దేశ ప్రజల కోసమే బీజేపీ, కాంగ్రేసేతర ఫ్రంట్‌గా మేం ఏర్పడుతున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో మౌళికమైన మార్పులు రాలేదు. 70 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా, 40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు, సామాన్యుల మేలు కోసమే ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దానికి తన ఆశీస్సులు ఉంటాయని దేవేగౌడ గారు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతిచ్చి ఓటేయాలని కోరుతున్నా’’ అని కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌ ఆలోచనలో న్యాయముంది: ‘‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశం చాలా సమస్యలను జయించలేకపోయిందన్న మాట వాస్తవం. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ అవసరం. కేసీఆర్‌ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని దేవేగౌడ మీడియాతో చెప్పారు.