Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కేంద్రం అన్ని రాష్ట్రాలకు ట్రిపుల్‌ ఐటీలను మంజూరు చేసింది కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు మాత్రం ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. తాము చేసిన అనేక విజ్ఞప్తులు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఐఐఎం, ప్రతీ జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, డైట్స్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకూ దాని ఏర్పాటుపై చర్యలు తీసుకోలేదని అన్నారు.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అధ్యక్షతన ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (కేబ్‌) సమావేశంలో కడియం పాల్గొన్నారు. సోమవారం.. పాఠశాల విద్య, మంగళవారం ఉన్నత విద్యపై సుధీర్ఘ చర్చలు జరిగాయని వివరించారు. వివిధ అంశాలపై ఏర్పడ్డ ఎనిమిది సబ్‌ కమిటీలు తమ నివేదికలను అందజేశాయని ఆయన మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో విద్యాపరంగా తాము తీసుకుంటున్న చర్యలను వివరించానని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా తెలంగాణలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించామని అన్నారు.
దీనికి కేంద్రమంత్రి జావడేకర్‌ అభినందనలు తెలపడంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. కాగా, ఉన్నత విద్యకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆధార్‌కు లింక్‌ చేసి డిగ్రీ అడ్మిషన్లు ఇస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో బోగస్‌ నియామకాలను అరికడుతున్నామన్నారు. బయోమెట్రిక్‌ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నామని, 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారిని పరీక్షలు రాయడానికి అనుమతించడం లేదని తెలిపారు. ఇది మంచి ప్రయోగమని.. అన్ని రాష్ట్రాలు ఈ పద్ధతిని అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారని వివరించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించినట్లు తెలిపారు.
కస్తుర్బా పాఠశాలల్లో బోధనను 12వ తరగతి వరకు విస్తరించాలని కోరినట్లు వెల్లడించారు. అడ్మిషన్లకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తిగా తగ్గిందని వివరించారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆధార్‌ తప్పనిసరి చేశామని అన్నారు. తెలంగాణలో బోగస్‌ టీచర్లు లేరని స్పష్టం చేశారు. ఇక డీఎస్సీ నిర్వహణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్‌ విద్యను ప్రక్షాళన చేయడంతో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇవేం సమావేశాలు?
కేబ్‌ సమావేశాల పనితీరుపై కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలను గుర్తించడంతో పాటు 3 నెలలకు ఒకసారి కేబ్‌ సమావేశం ఏర్పాటు చేసి వాటిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇలా మొక్కుబడి సమావేశాలు విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ఉపయోగపడవని అన్నారు. కాగా, బాలికల విద్యపై ఏర్పడ్డ కేబ్‌ సబ్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన తాను 4 రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసి మధ్యంతర నివేదిక సమర్పించామని తెలిపారు. ఈ నివేదికలో పలు సిఫారసులను చేశామని, ఫిబ్రవరిలో తుది నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, సబ్‌ కమిటీలు నివేదికలు ఇచ్చినా వాటిపై కేంద్రం ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.