Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దిల్లీ: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేసేలా తీసుకొస్తున్న భారత తపాలా చెల్లింపుల బ్యాంకు (ఐపీపీబీ) సేవలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఐపీపీబీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయానికి దేశవ్యాప్తంగా 3,250 యాక్సెస్‌ పాయింట్స్‌, 650 బ్రాంచీల్లోనూ ఈ సేవలను ఆయా శాఖల అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఐపీపీబీ ద్వారా పొదుపు, కరెంట్‌ ఖాతా సేవలు, నగలు లావాదేవీలు, మర్చంట్‌ పేమెంట్స్‌ తదితర సేవలు అందించనున్నారు. ఐపీపీబీలో పొదుపు, కరెంటు ఖాతాలు తెరవడానికి ఎలాంటి పత్రాలూ సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్‌కార్డు, మొబైల్‌ నంబరు ఉంటే సరిపోతుంది. ఖాతా తెరిచినందుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జీరో బ్యాలెన్స్‌తోనూ ఖాతా తెరవొచ్చు. కరెంటు ఖాతాదారులు నెలలో ఎన్ని లావాదేవీలైనా జరపొచ్చు. నెలలో సరాసరి నగదు నిల్వ రూ.1000 ఉండేలా చూసుకోవాలి.

నగదు డిపాజిట్‌, విత్‌డ్రా, బదిలీ, ఇతర చెల్లింపులతో పాటు.. పింఛన్లు, ఉపాధిహామీ, గ్యాస్‌ రాయితీ, ఉపకార వేతనాలను సులభంగా పొందొచ్చు. ఖాతాదారులకు ఇచ్చే క్యూఆర్‌ కార్డులతో దుకాణాల్లో సరకులు కొన్నపుడు తేలిగ్గా చెల్లింపులు జరపొచ్చు. డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 1.55లక్షల తపాలా కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.