Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఉన్నత చదువుల కోసం భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. అంతేకాదు గత మూడు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల కోసం తమ తల్లిదండ్రులు పెట్టే ఖర్చులు కూడా పెరిగాయట. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లల ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజుల కోసం తల్లిదండ్రులు పెట్టే ఖర్చు మూడు సంవత్సరాలతో పోలిస్తే దాదాపు 44శాతం పెరిగింది.

విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలవైపు మొగ్గు చూపుతున్నారట. విదేశాల్లో చదువుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే నమ్మకంతోనే అక్కడకు ప్రయాణమవుతున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే విదేశాలకు వెళ్లే సంఖ్య పెరిగింది. 2015-16లో 1,32,888మంది విదేశాలకు వెళ్లగా, 2016-17లో వీరి సంఖ్య 1,86,267కు చేరింది.

ఆస్ట్రేలియా కూడా భారతీయులకు సానుకూలంగా మారడంతో అక్కడి వెళ్లే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. దీనిపై భారత్‌లోని ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌ రోడ్‌ హల్టన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండే భారతీయుల సంఖ్య 68,000లకు చేరిందని, గత రెండేళ్లలో దాదాపు 8,000మంది విద్యనభ్యసించడానికి వచ్చారని తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇక విదేశాల నుంచి భారత్‌కు వచ్చి చదువుకునే వారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతోపాటు ఇక్కడి విద్యకోసం వారు పెట్టే ఖర్చుకూడా 20శాతం తగ్గింది. విదేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. టెక్నికల్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల ఫీజులు విదేశాలతో పోలిస్తే దాదాపు తక్కువే కావడంతో వారి ఖర్చు కూడా తగ్గుతోంది. 2016లో 37,947 మంది విదేశీ విద్యార్థులకు ఇక్కడి రావడానికి వీసా లభించింది. ఇక 2017లో వీరి సంఖ్య 36,887కు చేరింది. విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే నాలుగు విద్యా సంవత్సరాల్లో వీరి సంఖ్య 2లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇప్పుడున్న వారికి నాలుగు రెట్లు ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే ఆరు ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థుల కోసం 25శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నాయి.